నవతెలంగాణ – హైదరాబాద్: రష్యాలోని షిలోవ్‌స్కీ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రియాజాన్ ప్రాంతంలోని ఒక ఎలాస్టిక్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 130 మందికి పైగా గాయాల పాలైనట్లు రష్యా అత్యవసర సేవల విభాగం అధికారులు వెల్లడించారు. మాస్కోకు 250 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్లాంట్ రష్యా రాజధాని మాస్కోకు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిలోవ్‌స్కీ జిల్లా, రియాజాన్ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి.
రష్యన్ వార్తా సంస్థ ఆర్‌ఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్లాంట్‌లోని గన్ పౌడర్ వర్క్‌షాప్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.