Sunday, September 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం25 ఏండ్ల తరువాత మంజీర బ్యారేజీకి భారీ వరద

25 ఏండ్ల తరువాత మంజీర బ్యారేజీకి భారీ వరద

- Advertisement -

– రెండ్రోజులపాటు హైదరాబాద్‌కు నీటి సరఫరా బంద్‌
– మూసీకి వరదతో హైదరాబాద్‌లో ముంపు సమస్య : వాటర్‌ బోర్డు సీఎండీ అశోక్‌ రెడ్డి
– నీట మునిగిన పెద్దాపూర్‌ వాటర్‌ పంపుహౌజ్‌ పరిశీలన
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

మంజీరా బ్యారేజ్‌కి 25 ఏండ్ల తర్వాత భారీ స్థాయిలో వరద వచ్చిందని హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు సీఎండీ అశోక్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేస్తున్న పంపుహౌజ్‌ మునిగిపోవడంతో శనివారం పరిశీలనకు వచ్చిన సీఎండీ అశోక్‌రెడ్డి సంగారెడ్డిలోని ఐబీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సదాశివపేట మండలంóలోని పెద్దాపూర్‌లో ఉన్న వాటర్‌ ఫీల్టర్‌ బెడ్‌కు భారీఎత్తున వరదలు రావడంతో పంపు హౌజ్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయిందన్నారు. పంపు హౌజ్‌ పక్క నుంచి మూడు వరద కాలువలు ప్రవహించి ఒకే దగ్గర కలుస్తాయని చెప్పారు. రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆ మూడు కాలువలకు పెద్దఎత్తున వరద నీరు రావడంతో అవి ఒకే దగ్గర కలిసి రెండు మీటర్లు ఎత్తు ఉన్న పిల్టర్‌ బెడ్‌ గోడను దాటుకుని పంపు హౌజ్‌లోకి నీరు చేరిందన్నారు. ఈ సారి ఎన్నడూ రానంతగా వరదలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 600 ఎంజీడీ నీరు అవసరం ఉంటుందని, ఈ పంపు హౌజ్‌ మునగడం వల్ల 34 ఎంజీడీ నీరు ఆగిపోతుందన్నారు. కేవలం పంపుహౌజ్‌ మాత్రమే మునిగిపోయిందని, పక్కనే సబ్‌ స్టేషన్‌ ఉన్నా అందులోకి నీరు రాలేదన్నారు. నీరు వచ్చిన వెంటనే మోటర్లను ఆపేశారని, దాంతో ఎలాంటి నష్టం జరుగలేదన్నారు. వరద తగ్గిందని, రెండ్రోజుల్లో మోటార్లు బాగు చేయించి యథావిధిగా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.మూసీ నదికి వరదలు పెరగడం వల్లే హైదరాబాద్‌లో మునిగి కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు వచ్చిందని తెలిపారు. వికారాబాద్‌ జిల్లాలో వర్షాలతో హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ రిజర్వాయర్లకు భారీగా వరద వచ్చిందన్నారు. 2020 తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ స్థాయి వరద రావడం ఇదే తొలిసారి అన్నారు. రెండు రిజర్వాయర్ల నుంచి ఒకేసారి 35 వేల క్యూసెక్కుల వరద కిందికి వదలడంతో మూసీ నది ఉధృతి మరింత పెరిగిందన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేశామని, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఇన్‌ ఫ్లో తగ్గిందని తెలిపారు. ఈ సమావేశంలో జీఎం రామకృష్ణ, సీజీఎం బ్రిజేష్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -