భారతదేశ అభివృద్ధిలో కార్మికుల శ్రమ అపారమైనది. పరిశ్రమలు, నిర్మాణ రంగం, వ్యవసాయం తదితర అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తూ సంపదను సృష్టించే శక్తిగా కార్మికులు కృషి చేస్తున్నారు. ఉక్కు, వస్త్ర, ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, నిర్మాణం వంటి పరిశ్రమలు కార్మికుల శ్రమతోనే అభివృద్ధి చెందాయి. కార్మికులే పరిశ్రమలకు ప్రాణం. అంతే కాదు సేవా రంగంలో పారిశుధ్య కార్మికులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, హాస్పిటల్ కార్మికులు, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, ట్రాన్స్‌పోర్ట్ ఇలాంటి అనేక రంగాల్లోని కార్మికులు ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వాతంత్య్రం అనంతరం ఎన్నో దశాబ్దాలుగా కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యల పరిష్కారానికి, దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు అనేక పోరాటాలను, ప్రాణత్యాగాలు చేసి చట్టాలను, హక్కులను సాధించుకున్నారు. ఆ హక్కులకు, చట్టాలకు బీజేపీ ప్రభుత్వం నేడు సంకెళ్లు వేసి కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను, దేశ సంపదను దోచిపెడుతున్నది. అందులో భాగంగానే ట్రేడ్ యూనియన్ చట్టం-1926, పారిశ్రామిక ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) 1946, పారిశ్రామిక వివాదాల చట్టం-1947 ఇటువంటి కార్మిక చట్టాలను రద్దుచేసి, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020ను తీసుకొచ్చింది. ఇది భారత కార్మికవర్గానికి తీవ్ర అన్యాయం చేసే లేబర్‌కోడ్స్. వీటిన రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సీఐటీయూ ఈనెల 20న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది.
ట్రేడ్ యూనియన్ 1926 చట్టం కార్మికులకు సంఘటిత హక్కు, కార్మికులందరూ ఒక సంఘంగా ఏర్పడి యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కల్పించింది. ట్రేడ్ యూనియన్ల ద్వారా కార్మికులందరూ తమ సమస్యల పరిష్కారం కోసం (వేతనాలు, పని గంటలు, పని పరిస్థితులు తదితర) శక్తివంతంగా తమ గొంతును వినిపించి పోరాడే హక్కు లభించింది. యూనియన్ల ద్వారా స్వేచ్ఛగా కార్మికులు యాజమాన్యంతో చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించుకోగలిగే అవకాశం ఈ చట్టం కల్పిం చింది. కార్మికుల హక్కులు, సమానత్వం కోసం యూనియన్లు న్యాయపరమైన పోరాటాలు చేసే హక్కు, కార్మికులను యాజమాన్యం శ్రమదోపిడీ చేయకుండా ట్రేడ్ యూనియన్ చట్టం కార్మికులకు రక్షణగా ఇంతకాలం ఉన్నది. ఈ చట్టాన్ని రద్దుచేసి కార్మికులు సంఘటితం కాకుండా, దోపిడీని ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్‌కు ఒక సంస్థలో ఉన్న కార్మికుల్లో కనీసం పది శాతం మంది లేదా వంద మంది సభ్యత్వం కలిగి ఉండాలి. కానీ ఈ దేశంలో చిన్న చిన్న సంస్థల్లో కోట్లాదిమంది పని చేస్తున్నారు. వారు యాజమాన్యాల దోపిడీకి గురవుతున్నా ప్రశ్నించడానికి కానీ, యూనియన్ పెట్టుకోవడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఒక సంస్థ, కంపెనీలో యూనియన్లను యాజమాన్యం గుర్తించాలి అంటే 51 శాతం సభ్యత్వం తప్పనిసరి చేసి యూనియన్లను బలహీనపరిచి సంస్థల యాజమాన్యాలకు లాభం చేకూర్చే అవకాశం లేబర్ కోడ్ ద్వారా బీజేపీ ప్రభుత్వం కల్పించి కార్మికులకు ద్రోహం చేసింది.
పారిశ్రామిక ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్)1946 ప్రకారం పనివేళ సెలవులు, ప్రవర్తన నియమావలి, ఉద్యోగ భద్రత అంశాలతో కూడిన స్టాండింగ్ ఆర్డర్స్‌ను పరిశ్రమ, సంస్థలు రూపొందించాలి. ఏ నిబంధన కింద పనిచేస్తున్నాడనేది ముందుగానే ఆ కార్మికులు తెలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం నుండి కార్మికుడిని తొలగించాలంటే చట్ట ప్రకారం ప్రక్రియలు పాటించాలి. యాజమాన్యానికి ఇష్టం వచ్చినట్లు కార్మికుడిని పనినుండి తొలగించడానికి వీల్లేదు. ఉద్యోగి మీద తప్పుడు ఆరోపణలు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. అంటే స్పష్టమైన కారణాలను కార్మికులకు చూపి ఏ చర్యలు తీసుకోబోతున్నారో ఉద్యోగికి ముందుగానే తెలియజేయాలి. సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే విధమైన నియమాలు ఉంటాయి. ఉద్యోగిని బట్టి నియమాలు మార్చే అవకాశం ఉండదు. వందమందికి పైగా ఉన్న ప్రతి సంస్థ పనివేళలు, సెలవులు, క్రమశిక్షణా చర్యలు, సమయపాలన, పదోన్నతులు తదితర అంశాలను పారిశ్రామిక ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) 1946 ప్రకారం అధికారికంగా సంస్థ యాజమాన్యం కార్మికులకు చూపాల్సిందే. కానీ శ్రమించే కార్మికుడి హక్కును కాలరాసి సంస్థ యాజమాన్యం దోపిడీ చేసుకోవడానికి ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కార్మికుల హక్కులకు సంకెళ్లు వేసి పారిశ్రామిక అధిపతులు కార్మికుల శ్రమను, శ్రమ ద్వారా ఉత్పత్తి అయిన సంపదను కొల్లగొట్టడానికి స్వేచ్ఛను ఇచ్చింది. పారిశ్రామిక సంబంధాల కోడ్-2020 నియమాల ప్రకారం మూడు వందల మంది కంటే ఎక్కువ కార్మికులు,ఉద్యోగులు ఉన్న సంస్థలే స్టాండింగ్ ఆర్డర్స్ రూపొందించాలి. అంతకంటే తక్కువ (299) మంది కార్మికులు ఉన్న సంస్థలకు స్టాండింగ్ ఆర్డర్స్ అవసరం లేదని లేబర్ కోడ్ చెబుతుంది. అంతకన్నా తక్కువ మంది పనిచేస్తున్న కంపెనీల్లో కోట్లాది మంది కార్మికులు పనిచేస్తున్నారు.వీరందరూ పని వేళలు, పని గంటలు, సెలవులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలలో యాజమాన్యాల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. ఎన్ని గంటలైనా కార్మికుల చేత పని చేయించుకోవచ్చు. పని వేళలు మార్చవచ్చు. సెలవులను రద్దు చేసి సెలవు రోజు కూడా కార్మికుల చేత శ్రమలు చేయించుకోవచ్చు. ఎప్పుడైనా ఏ కారణం చూపకుండా కూడా పని నుండి కార్మికులకు తొలగించడానికి లేబర్ కోడ్ ద్వారా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించి శ్రమజీవుల జీవితాలను చిదుముతున్నది.
పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ఉద్యోగ భద్రత సమ్మె హక్కు, న్యాయపరంగా తమ హక్కులను సాధించుకునే అవ కాశం కార్మికులకు కల్పించింది. వంద మందికి పైగా ఉన్న సంస్థల్లో పని నుండి కార్మికుడిని తొలగించాలన్నా, సంస్థను కంపెనీ యాజమాన్యం మూసివేయాలన్నా ప్రభుత్వాల అనుమతి ముందుగా తీసుకుని కార్మికులకు న్యాయపరంగా రావలసిన నష్టపరిహారం అందించాలి. కార్మికులు తన సమస్యను పరిష్కరించుకునేందుకు చట్ట ప్రకారం ఫిర్యాదు చేసుకోవచ్చు. అధికారిక గుర్తింపు ద్వారా యాజమాన్యంతో కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలపై చర్చలు జరిపే హక్కు ఈ చట్టం కల్పించింది. కానీ ఇటువంటి హక్కులను కల్పించిన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి దాని స్థానంలో లేబర్‌కోడ్ ప్రవేశపెట్టింది.
ఈ కోడ్‌వల్ల ఓ సంస్థలో పనిచేస్తున్న కార్మికుడు తనకు కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పిఎఫ్, బోనస్, పని గంటలు, సమాన పనికి – సమాన వేతనం, అదనపు పనికి – అదనపు వేతనం కల్పించాలని, మహిళలపై వేధింపులు అరికట్టాలని అడిగినా, యాజమాన్యానికి నచ్చకపోయినా కార్మికుల్ని పని నుండి నిర్ధాక్షిణ్యంగా తొలగించే అవకాశం కల్పించింది. దీంతో అన్యాయంగా పని నుండి తొలగించకూడదన్న హక్కును కార్మికులు కోల్పోబోతున్నారు. కార్మిక సంఘాల హక్కులు కూడా తగ్గిపోతాయి, బలహీనపడి కార్మికులు సమిష్టిగా తమ సమస్యలను వినిపించడానికి కానీ పరిష్కరించుకోవడానికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పని గంటలు, పని పరిస్థితులపై నియంత్రణ లేకుండా పోతుంది. సంస్థ యాజమాన్యం కార్మికుడికి కనీస వేతనం ఇవ్వకపోయినా వేతనంలో కోతపెట్టినా, అధిక పనిగంటలు పని చేయించుకున్నా, అదనపు వేతనం అడగడానికి కార్మికుడికి చట్టం లేదు, హక్కు కూడా లేకుండా పోతుంది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పబ్లిక్ యుటిలిటీ సర్వీసుల్లో మాత్రమే సమ్మె ఆరంభానికి పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీసివ్వాలి. ఇతర రంగాల్లో ముందుగా నోటీస్ ఇవ్వకుండానే సమ్మె ప్రారంభించవచ్చు. ఇందుకు భిన్నంగా పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రకారం ఏ సంస్థలోనైనా సరే సమ్మె నోటీస్ ముందుగా ఇవ్వాలి. పాత చట్టం ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చిన రెండు వారాల్లోపు సమ్మె చేయరాదు. కానీ ఈ కోడ్ వల్ల సమ్మె నోటీస్ ఇచ్చిన అరవై రోజుల్లోగా సమ్మె చేయరాదు. దీంతో యాజమాన్యాలు కార్మికులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది.
కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి, హక్కుల కోసం చట్టబద్ధంగా శాంతియుతంగా పోరాడే అవకాశాలు కోల్పోతు న్నట్టే. తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న కార్మికులపై క్రమశిక్షణ పేరుతో చర్యలు తీసుకోవచ్చని లేబర్ కోడ్ చెబుతున్నది. సమ్మె చేస్తున్న సమయంలో నో వర్క్ నో పే అమలు చేసే అవకాశం ఉన్నది. సమ్మె వల్ల పరిశ్రమకు నష్టం జరిగిందని కార్మికులు నుండి నష్టపరిహారం వసూలు చేయవచ్చు. మూడు నెలలు జైలు లేదా రూ.10 వేలు జరిమానా విధించవచ్చు. సమ్మె పునరావతమైతే రూ.50 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 ద్వారా పరిశ్రమల యాజమాన్యాల చేతికి కల్పించింది. భారత కార్మికవర్గం ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న చట్టాలను, హక్కులను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌ల ద్వారా కార్మికుల శ్రమను దోచి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకున్నది. ఈ దుర్మార్గపు విధానాల్ని బద్దలుకొట్టాల్సిన తరుణం ఆసన్నమైనది. మే 20న సార్వత్రిక సమ్మెతో మోడీ,కార్పొరేట్ల మైత్రి బంధనాల నుండి విముక్తి పొందాలి. ఇదే కార్మికవర్గ కర్తవ్యం.
– కూరపాటి రమేష్, 9490098048
మే20 సార్వత్రిక సమ్మె-కార్మికుల కర్తవ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES