– ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలు
కదంతొక్కి, రణం సలిపి, కణకణమండే అగ్నికెరటంలా ప్రపంచ కార్మికుల చేతిలో ఎర్రజెండా రెపరెపలాడుతూ నింగికెగిసింది. సామ్రాజ్యవాద, పెట్టుబడిదారుల గుండెల్లో గుబులు రేపింది. ఆంక్షల్ని ధిక్కరించి నిర్భంధ దేశాల్లోనూ కార్మికవర్గం ఎర్రజెండాలు చేతబట్టి వీధుల్లోకి వచ్చింది. ప్రపంచ భవిష్యత్ కార్మికవర్గానిదేనంటూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల (మేడే) లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటింది. ట్రంప్ దెబ్బకు హడలెత్తుతున్న అమెరికన్లు ‘రెడ్ ఫ్లాగ్’ను చేతబట్టి, భవిష్యత్ వైపు ఆశగా ఎదురుచూశారు. ఇరాన్ వంటి నిర్భంధ దేశంలో సైతం బానిస సంకెళ్ల విముక్తి కోసం అక్కడి కార్మికవర్గం ఎర్రజెండాను ఆశ్రయించింది. చికాగో నగరం రెడ్‌షర్ట్ వాలంటీర్లతో ఎర్రసముద్రాన్ని తలపించి, సామ్రాజ్యవాదుల శ్రమ దోపిడీని ప్రశ్నించింది. కష్టజీవుల కన్నీటి చుక్కలతో సంపద పోగేసుకుంటున్న ప్రపంచ పెట్టుబడిదారులకు ‘మేడే’ సరికొత్త సవాళ్లను విసిరింది. ‘8 గంటల పని, కష్టానికి తగ్గ ఫలితం’ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. భారతదేశంలోనూ ‘మేడే’ వేడుకలు స్ఫూర్తివంతంగా జరిగాయి. మోడీ సర్కార్ కార్పొరేట్, పెట్టుబడిదారీ, ప్రయివేటీకరణ సానుకూల విధానాలను కార్మికవర్గం ప్రశ్నించింది. భవిష్యత్ పోరాటాలకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు దిక్సూచిలా మారాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా అన్ని పారిశ్రామికవాడల్లో అరుణపతాకాలు రెపరెపలాడాయి. లేబర్ అడ్డాల్లో ప్రపంచ కార్మికుల ఐక్యత వర్థిల్లాలనే నినాదాలు మిన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, దినసరివేతన జీవులు సహా యావత్ కష్టజీవుల కవాతులు, ప్రదర్శనలతో అంతర్జాతీయ సమాజం కార్మిక రాజ్య స్థాపన కోసం ఉత్తేజితమైంది. ఘనంగా మేడే వేడుకల్ని జరుపుకుంది.
కష్టజీవుల రణన్నినాదం
- Advertisement -
RELATED ARTICLES