రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అధికారంలో ఉండి తొలి వందరోజుల్లో హీనమైన ప్రజాదరణ కలిగిన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో చరిత్రకెక్కాడు. అయినప్పటికీ ఎలాంటి సిగ్గూ బిడియం లేకుండా ఆత్మస్తుతి, పరనిందలతో వందవరోజు ఉప న్యాసం చేశాడు. ఇంతటి ఘనత వహించి ఈ పెద్ద మనిషి యావత్ ప్రపంచంతో పాటు కార్మిక వర్గానికి కూడా ముప్పు తేవటంతో అమెరికా చరిత్రలో అతి పెద్ద సంఖ్యలో గురువారం నాడు ఆరువందలకు పైగా జరిగిన మే డే దీక్షాదిన ప్రదర్శనల్లో లక్షలాది మంది పాల్గొని కబడ్దార్ కార్మికుల జోలికి రావద్దని హెచ్చరించటం కూడా ముఖ్యమైన పరి ణామమే. రెండవసారి అధికారానికి వచ్చి వందరోజుల్లో లోకజ్ఞాన విప్లవం తెచ్చానని, పెను మార్పులకు నాంది పలికినట్లు ట్రంప్ చెప్పుకున్నాడు. జనంలో తన పలుకుబడి తగ్గిందన్న సర్వేలను నకిలీ వంటూ ట్రంప్ అపహాస్యం చేశాడు.తనకు గట్టి మద్దతు ఇచ్చిన మిచిగాన్ రాష్ట్రంలో ఆటోమొబైల్ కేంద్రమైన డెట్రాయిట్ సమీపంలో జరిగిన సభలో మాట్లాడుతూ తన అధికారాన్ని కుదించేందుకు విప్లక కమ్యూనిస్టు, వామపక్ష భావాలు కలిగిన న్యాయమూర్తులు చూస్తు న్నారని ఏదీ తనను ఆపలేదని ఎన్నికల సభల్లో మాదిరి రంకెలు వేశాడు. గడచిన వందేండ్లలో తన మాదిరి విజ యాలు సాధించిన వారెవరూ లేరన్నాడు.
ముందే చెప్పుకున్నట్లు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలి వందరోజుల్లో యాభైశాతం కంటే తక్కువ పలుకు బడిన కలిగిన వారు ఇద్దరే అధ్యక్షులని, ట్రంప్‌కు నలభైనాలుగు శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చినట్లు గాలప్ సర్వే పేర్కొన్నది. ఎన్‌పిఆర్ ఇతర సంస్థలతో కలసి నిర్వహించిన సర్వే ట్రంప్ ఫెయిలైనట్లు ఎఫ్ గ్రేడ్ ఇచ్చిన వారు 45శాతం మంది ఉన్నారు. ఏ,బి గ్రేడ్లు 40, సి,డి గ్రేడ్లు పదిహేనుశాతం మంది ఇచ్చారు.చిత్రం ఏమి టంటే అధికార పక్షం రిపబ్లికన్లలో ఏ గ్రేడ్ ఇచ్చినవారు 54శాతం మందే ఉండటం విశేషం.నోరు తెరిస్తే అబ ద్దాలు మాట్లాడుతున్న ట్రంప్ వంద రోజుల ప్రసంగంలో కూడా తన ఏలుబడిలో చిన్న విషయాల మీద కూడా దిగజారి మాట్లాడాడు. గుడ్ల ధరలు 87శాతం తగ్గినట్లు పచ్చి అవాస్తవాన్ని చెప్పాడు.తాను వచ్చిన తర్వాత పెట్రోలు ధరలు చాలా తగ్గాయ న్నాడు, నిజానికి స్వల్పంగా పెరిగాయి. ప్రపంచ దేశాల మీద తొలి వందరోజుల్లో ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని తానే తొంభై రోజుల పాటు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించటం ట్రంప్ బలహీనతకు చిహ్నం.
ఇరవై నాలుగు గంటల్లోనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడది కనుచూపు మేరలో కనిపించటం లేదు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు మరణించటాన్ని తప్పుపట్టిన అపరమానవతా వాది గాజాలో అదే నోటితో ఇజ్రాయిల్ జరుపుతున్న మారణకాండను సమర్ధిస్తున్న దుర్మార్గం రెండు నాలుకల వైఖరి తప్ప మరొకటి కాదు.ఇలా ఎన్నో వైఫల్యాలు, స్వంత కార్మికవర్గంపైనే దాడికి పూనుకున్న కారణంగానే అతగాడి పలుకుబడి అంతగా దిగజారిందన్నది స్పష్టం. ”బిలియనీర్ల స్వాధీనాన్ని అడ్డు కోవాలి.మనం అత్యధి కులం వారు అల్పసంఖ్య. ఇదే మేడే సందేశం, మాతో చేతులు కలపండి ” అంటూ మేడే దీక్షా దిన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంస్థలు పేర్కొన్నాయి. స్థానిక కార్మికులే కాదు, వలస వచ్చిన అన్ని తరగతులకు చెందిన వారు గురువారం నాటి ప్రదర్శనల్లో పాల్గ్గొన్నారు. వలస వచ్చిన వారికి రక్షణ ఈ ఏడాది మే డే పిలుపులోప్రధాన అంశంగా ఉంది. వేతనాలు, ఉపాధి, పౌరహక్కులు, అన్ని రకాల స్వేచ్చలను ట్రంప్ సర్కార్ హరిస్తున్నదని వక్తలు పేర్కొన్నారు.
కుబేరుడైన ఎలన్‌మస్క్, అతగాడి కులీన మద్దతుదారులు మన సామాజిక తరగతుల్లో సంక్షోభానికి కారకులౌతున్నారంటూ జనాన్ని హెచ్చరించారు. వేతనాలను దిగ్గోసేందుకు, ఇప్పటివరకు అనుభవిస్తున్న సౌకర్యాలను కుదిం చేందుకు, మొత్తం ఆత్మగౌరవాన్నే దెబ్బతీసేందుకు చూస్తున్నారని, వలస కార్మికులను పోటీపెట్టి కార్మిక సంఘాల ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగు తోందని వక్తలు పేర్కొన్నారు. ఈ మేడే చరిత్రలో మరో కొత్త అధ్యాయమని, నూతన యుగానికి నాంది, కార్మికులు దయా దాక్షిణ్యాలు కోరటం లేదు, న్యాయంగా రావాల్సిందాన్ని కోరుతున్నా మని స్పష్టం చేశారు.డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్యయుద్ధానికి ప్రపంచ దేశాల్లో ఎలా ప్రతి ఘటన ఎదురవుతున్నదో, ప్రాజెక్టు 2025 పేరుతో కార్మికవర్గం మీద ప్రారంభించిన దాడికి కూడా అంతకంటే ఎక్కువ వ్యతిరేకత పెరగటం అనివార్యం.
ట్రంప్‌కు మేడే హెచ్చరిక!
- Advertisement -
RELATED ARTICLES