నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం సెప్టెంబరు 16 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ షెడ్యూలు విడుదల చేసింది. సెప్టెంబర్ 15న జనరల్ మెరిట్ జాబితాను వెబ్ సైట్‌లో పెట్టనున్నట్లు వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం … మొదటి విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబరు 30వ తేదీ నాటికి అన్ని దశల్లో కౌన్సెలింగ్ పూర్తి చేయనున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
వెబ్ ఆప్షన్లు..
ఇక రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సెప్టెంబర్ 29న రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరక సెప్టెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని కాళోజీ వర్సిటీ తన ప్రకటనలో వెల్లడించింది.
ఎపి ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ గడువు మళ్లీ పెంపు …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ గడువును సెప్టెంబరు 14 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో తెలిపింది. మొదట ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబరు 10న సీట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. అయితే దీన్ని సెప్టెంబరు 12కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు మొత్తం 1,67,161 మంది విద్యార్ధులు ప్రవేశాలకు నమోదు చేసుకోగా, ఇందులో 1,54,022 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 1,50,359 మంది కాలేజీల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది.