ముంబయి : మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికలను నిలిపివేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 6న మహారాష్ట్ర క్రికెట్ సంఘానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఎన్నికలకు కొన్ని వారాల ముందు సుమారు 400 మంది సభ్యులకు కొత్తగా ఓటు హక్కు కల్పించటాన్ని సవాల్ చేస్తూ భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ న్యాయస్థానంలో సవాల్ చేశారు. కొత్త సభ్యుల చేరికలో పారదర్శకత లోపించిందని భావించిన ద్వి సభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఏ ఎన్నికల పద్దతి ప్రకారం పలు ఉప-విభాగాల్లో 16 మంది కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. ఎన్నికైన 16 మంది కౌన్సిలర్లు.. ఓటింగ్ లేదా ఏకగ్రీవంగా ఆఫీస్‌బేరర్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చేరిన కేదార్ జాదవ్.. ఎన్‌సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎంసీఏ అధ్యక్షుడు రోహిత్ పవార్‌తో అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నాడు. ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించటం శరద్ పవార్ వర్గానికి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.



