నవతెలంగాణ-హైదరాబాద్: ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయే తప్ప, గోదావరి జల ద్రోహం మాత్రం ఆగలేదని తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో హరీష్ రావు అన్నారు. బనకచర్ల నుంచి నల్లమల సాగర్ వరకు పేర్లు మారినా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. “కత్తి చంద్రబాబు చేతిలో ఉంది.. పొడిచేది రేవంత్ రెడ్డి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై సమావేశానికి వెళ్లబోమని చెప్పి వెళ్లారని, ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఒత్తిడి వల్లే ఈరోజు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం చేసే ఈ సమావేశానికి ఎందుకు హాజరవుతున్నారు? అంటూ ప్రశ్నించారు. గతంలో తాను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తేదీలు మార్చి ఉత్తరాలు రాసిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు.తెలంగాణ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆదిత్య నాథ్ దాస్ గతంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఎలా తెలంగాణ తరఫున సమావేశానికి నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో మరో ఇరిగేషన్ అధికారి దొరకలేదా అంటూ మంది పడ్డారు. ఈ విషయాన్ని “దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా ఉంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.



