Friday, May 16, 2025
Homeప్రధాన వార్తలుప్రయాణికులకు మెట్రో షాక్‌

ప్రయాణికులకు మెట్రో షాక్‌

- Advertisement -

– ఎల్లుండి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి..
– కనిష్ట చార్జీ రూ.12.. గరిష్ట చార్జీ రూ.75కు పెంపు
నవతెలంగాణ-సిటీబ్యూరో

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ షాకిచ్చింది. భారీగా మెట్రో చార్జీలను పెంచేసింది. ఐటీ ఉద్యోగులు, ప్రయివేట్‌ ఎంప్లాయిస్‌తోపాటు నిత్యం మెట్రో రైల్‌లో ప్రయాణించేవారికి పెరిగిన చార్జీలు భారం కానున్నాయి. ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ మెట్రో రైలు కనీస చార్జి రూ.10 నుంచి రూ. 12కు, గరిష్ట చార్జి రూ.60 నుంచి రూ.75కు పెంచింది. పెరిగిన మెట్రో చార్జీలు రేపటి(ఈ నెల 17) నుంచి అమల్లోకి రానున్నాయని ఎల్‌అండ్‌టీ సంస్థ గురువారం ప్రకటించింది. మెట్రో రైల్వేస్‌ చట్టం 2002లోని సెక్షన్‌ 34 ప్రకారం.. చార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ) ఏర్పాటైందని, ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ 25 జనవరి 2023న సవరించిన చార్జీల స్వరూపాన్ని సిఫార్సు చేస్తూ నివేదికను సమర్పించిందని తెలిపింది. మెట్రో రైల్వే ఓఅండ్‌ఎం చట్టంలోని సెక్షన్‌ 37 ప్రకారం.. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు చార్జీలు పెంచినట్టు చెప్పింది. నాణ్యమైన సేవలు అందించేందుకు చార్జీల సవరణ ఉపయోగ పడు తుందని మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని ఎల్‌అండ్‌టీ సంస్థ విజ్ఞప్తి చేసింది.
నష్టాలు.. అప్పులను సాకుగా చూపుతూ..
హైదరాబాద్‌ నగరంలో ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, నాగోల్‌- రాయదుర్గం, జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మూడు కారిడార్లు కలిపి రోజుకు 5 లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, గతంలో కరోనా, ఇతర కారణాలతో మెట్రో నష్టాల్లో నడిచిందని అధికారులు చెబుతున్నారు. ఆ నష్టాలను పూరించేందుకు టికెట్ల రేట్లను పెంచడం, లేదా ప్రభుత్వం ఆర్థికంగా అదుకోవడమే మార్గమని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు మెట్రో అధికారులు తెలిపారు. కరోనా దెబ్బకు మెట్రో ప్రయాణీకుల సంఖ్య తగ్గి.. ఆర్థిక భారం పెరిగి అది ప్రస్తుతం రూ.6500కోట్లకు పెరిగినట్టు మెట్రో అధికార వర్గాల సమాచారం. దీనికి తోడు మెట్రో నిర్మాణ సమయంలో తెచ్చిన అప్పుల అధిక వడ్డీల చెల్లింపులకే ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్టు పలుమార్లు చెప్పారు. అయితే, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం సుమారు 267 ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ భూమి మెట్రో స్టేషన్లు, డిపోలు, పార్కింగ్‌ సౌకర్యాలు, ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌(టీవోడీ) కోసం ఉపయోగించి ఆదాయం సమకూర్చుకోవాలి. అయితే, కొన్ని చోట్లనే ప్రభుత్వం ఇచ్చిన భూమిని మెట్రో డెవలప్‌ చేసి కమర్షియల్‌ కాంప్లెక్సులు నిర్మించినట్టు తెలుస్తోంది. 267 ఎకరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే ఆర్థికభారం కొంతైనా తగ్గే అవకాశం ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆస్తులను వదిలేసి టికెట్ల రేట్లు పెంచి జనాల జేబులకు చిల్లులు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సర్కారు అనుమతి లేకుండానే..
మెట్రో రైల్వే(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) యాక్ట్‌ 2002 ప్రకారం రేట్లను సవరించినట్టుగా ఎల్‌అండ్‌టీ మెట్రో తెలిపింది. ఈ చట్టం ప్రకారం మెట్రో రైల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంఆర్‌ఎ) ప్రారంభ చార్జీలను నిర్ణయించే అధికారం కలిగి ఉంటుంది. ఎల్‌అండ్‌టీ, మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌హెచ్‌ఎల్‌) హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో కన్సెషసర్‌గా, ఎమ్‌ఆర్‌ఎగా వ్యవహరిస్తుంది. 2017లో ముంబయి హైకోర్టు.. మెట్రో రైలు రేట్ల విషయంలో కన్సెషనర్‌కు అనుకూలంగా తీర్చు ఇచ్చింది. దీని ఆధారంగా హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీ కూడా రేట్ల నిర్ణయంలో స్వతంత్రతను పొందింది. అయితే, మెట్రో స్వతంత్రంగా రేట్లను పెంచుకోవాలంటే ఎఫ్‌ఎఫ్‌సీ సిఫారసు అవసరం. 2022లో మెట్రో టికెట్‌ రేట్లను పెంచాలని ప్రభుత్వాన్ని కోరినప్పుడు ఎఫ్‌ఎఫ్‌సీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇన్‌ఫ్లేషన్‌, హౌల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌, ఎల్‌అలండ్‌టీ ప్రతిపాదనలను అధ్యయనం చేసి, 2023లో రేట్ల సవరణను సిఫార్సు చేసింది. ఎఫ్‌ఎఫ్‌సీ ఆమోదం పొందితే మెట్రో ధరల పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకున్నా అమలు చేయొచ్చు. ఆ మేరకే ఎల్‌అండ్‌టీ సంస్థ ముందుకు వెళ్తోంది.
చార్జీల పెంపును విరమించుకోవాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ చార్జీల పెంపుతో సామాన్య జనంపై తీవ్రమైన భారం పడుతుందని.. వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్‌ అండ్‌టీ మెట్రో రైల్‌ సంస్థకు ఆర్థిక నష్టాలు వస్తున్నాయని, అందుకే టికెట్ల రేటు పెంచాల్సి వస్తున్నదని ఆ సంస్థ చెప్పడం సరికాదన్నారు. 50 శాతం టికెట్‌ ద్వారా, 50 శాతం రియల్‌ ఎస్టేట్‌ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ఒప్పందంలో రాసుకున్నారని, కానీ రియల్‌ ఎస్టేట్‌ ద్వారా 10 నుంచి 15 శాతం కూడా ఆదాయం రాబట్టుకోలేకపోవడం ఎల్‌అండ్‌టీ సంస్థ వైఫల్యమని పేర్కొన్నారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ప్రజలపై టికెట్‌ చార్జీల భారం పెంచడం ఏ రకంగానూ సమంజసం కాదన్నారు. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ నివేదిక మేరకే పెంచుతున్నట్టు ఎల్‌అండ్‌టీ చెబుతున్నా.. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికైనా అందించారా? కేంద్ర ప్రభుత్వం కూడా తమకు నివేదిక అందలేదని చెబుతున్నదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం లేకుండానే ఈ చార్జీలు పెంపుదల ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని మెట్రో రైల్‌ చార్జీల పెంపుదలను తక్షణమే నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెరిగిన చార్జీల వివరాలు
– మొదటి రెండు స్టాప్‌లకు రూ.12
– 2 నుంచి 4స్టాప్‌ల వరకు రూ.18
– 4 నుంచి 6స్టాప్‌ల వరకు రూ.30
– 6 నుంచి 9స్టాప్‌ల వరకు రూ.40
– 9 నుంచి 12స్టాప్‌ల వరకు రూ.50
– 12 నుంచి 15స్టాప్‌ల వరకు రూ.55
– 15 నుంచి 18స్టాప్‌ల వరకు రూ.60
– 18 నుంచి 21స్టాప్‌ల వరకు రూ.66
– 21 నుంచి 24స్టాప్‌ల వరకు రూ.70
– 24 స్టాప్‌లు.. ఆపైన రూ.75

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -