Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమైక్రోఫైనాన్స్‌ సంస్థలను నియంత్రించాలి

మైక్రోఫైనాన్స్‌ సంస్థలను నియంత్రించాలి

- Advertisement -

– ఐద్వా దేశవ్యాప్త ప్రచారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ఆర్థికంగా దోపిడీ చేసే మైక్రోఫైనాన్స్‌ సంస్థలను నియంత్రించాలని ఐద్వా డిమాండ్‌ చేసింది.మహిళల పెరుగుతున్న అప్పులు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు (ఎంఎఫ్‌ఐ) దోపిడీపై ఆగస్టు 23, 24 తేదీల్లో న్యూఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సూర్జీత్‌ భవన్‌లో జాతీయ ప్రజా విచారణ (లోక్‌ అదాలత్‌)ను నిర్వహించింది. సూక్ష్మ రుణ సంస్థల వ్యాప్తి, వాటి అణచివేత పద్ధతుల ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేయడానికి 21 రాష్ట్రాల నుంచి సుమారు 100 గ్రామాలలో 9,000 మంది మహిళలపై ఏడాది పొడవునా నిర్వహించిన సర్వే ముగింపు ఈ జాతీయ ప్రజా విచారణ అని ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే అన్నారు. మైక్రో సంస్థల రుణ ఉచ్చు కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన మహిళలు తమ బాధలను వెల్లడించారు. ఆత్మహత్య అంచున ఉన్న 15 రాష్ట్రాల మహిళలు నిపుణుల జ్యూరీ ముందు తమ దుర్బలత్వాలను వెల్లడించారు. జ్యూరీ సభ్యుడిగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ ప్రయివేట్‌ మైక్రో బదిలీ సంస్థల నియంత్రణను ఆర్‌బిఐ, ప్రభుత్వం నిర్ధారించాలని సూచించారు. మహిళలకు నాలుగు శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని, వడ్డీకి గరిష్ట చట్టపరమైన పరిమితిని నిర్ణయించాలని ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ డిమాండ్‌ చేశారు. 20 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది మహిళలు విచారణలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుండి 16 మంది మహిళలు తమ సాక్ష్యాలను జ్యూరీ ముందు సమర్పించారు. పశ్చిమ బెంగాల్‌, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పుదుచ్చేరి, బీహార్‌, త్రిపుర, హర్యానా ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి మహిళలు తమ విషాద అనుభవాలను వివరించారు. కేరళలోని కుటుంబంశ్రీ సహాయంతో అప్పుల నుంచి తన జీవితాన్ని నిర్మించుకున్న అలప్పుజకు చెందిన జిజి ప్రసాద్‌ జీవిత కథ, తమిళనాడులోని మలర్‌ అసోసియేషన్‌ కార్యకలాపాలు, నాబార్డ్‌లను ప్రత్యామ్నాయాలుగా ప్రదర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఐద్వా మద్దతుతో న్యాయం కోసం నాంచారమ్మ చేసిన పోరాటాన్ని వివరించారు. రాష్ట్రంలో ఫైవ్‌ స్టార్‌ ఫైనాన్స్‌ కంపెనీ వేదింపులతో గిరిజన మహిళ బనవత్‌ పార్వతి (45) తన జీవితాన్ని ముగించుకున్న ఘటనను వివరించారు. సర్వే నివేదిక, జ్యూరీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రచారాలను నిర్వహిస్తామని మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి మరియం ధావలే విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం నుంచి మహిళలకు రుణాల హక్కు కోసం పోరాటాన్ని బలోపేతం చేస్తామని అధ్యక్షురాలు పి.కె శ్రీమతి ప్రకటించారు. స్వతంత్ర జర్నలిస్ట్‌ పమేలా ఫిలిపోస్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి థామస్‌ ఫ్రాంకో, న్యాయవాది కీర్తి సింగ్‌, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, ఆల్‌ ఇండియా నాబార్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ అనా మిత్రా, నాబార్డ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, ఇతర ప్రముఖ పౌరులు కూడా హాజరయ్యారు.

డిమాండ్స్‌
– కేంద్ర ప్రాయోజిత మైక్రోఫైనాన్స్‌ గ్యారంటీ పథకం
– ఆత్మహత్యలు, ఆస్తి నష్టం కేసులలో పునరావాసం కోసం మైక్రోఫైనాన్స్‌ నిధి
– కేంద్ర చట్టంతో రుణ హక్కును నిర్ధారించాలి.
– ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం,
ఫాస్ట్‌ ట్రాక్‌ లోక్‌ అదాలత్‌లు ఏర్పాటు చేయాలి
– ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు,ఎంఎఫ్‌ఐలకు నిధుల బదిలీని ఆపడానికి ఆదేశాలు ఇవ్వాలి.
– ప్రతి ప్రభుత్వ స్టేట్‌ బ్యాంక్‌ శాఖలో మహిళా సెల్‌ను ఏర్పాటు చేయాలి.
– జన్‌ ధన్‌, సేవింగ్స్‌ బ్యాంక్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ఎస్‌హెచ్‌జీ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచడానికి ఆదేశాలు ఇవ్వాలి.
– బ్యాంకుల ప్రయివేటీకరణను ఆపాలి. ఎస్‌హెచ్‌జి-బ్యాంక్‌ లింకేజ్‌ ప్రోగ్రామ్‌ను విస్తరించాలి. నాబార్డ్‌ని బలోపేతం చేయాలి.
– వ్యవసాయ బంగారు సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించాలి.
– రుణగ్రస్తతకు మూలకారణాన్ని పరిష్కరించడానికి సామాజిక రంగ పథకాలపై బడ్జెట్‌ వ్యయాన్ని పెంచాలి.-
– 2022 మాస్టర్‌ డైరెక్షన్‌లను కఠినమైన నిబంధనలతో భర్తీ చేయాలి.
– ఎన్‌బీఎఫ్‌సీలు-ఎంఎఫ్‌ఐలు వసూలు చేసే వడ్డీ రేట్లపై గరిష్ట పరిమితిని విధించాలి.
– ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్‌ఎల్‌) పరిధి నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు-ఎంఎఫ్‌ఐలను తొలగించాలి.
– ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు- ఎంఎఫ్‌ఐలకు చౌక రుణాలు ఇవ్వకుండా ఆపాలి.
– ఆత్మహత్యల విషయంలో ఎక్స్‌ గ్రేషియా చెల్లింపు, పునరావాసం కోసం నియమాలను రూపొందించాలి.
– బలవంతపు పద్ధతులు, దోపిడీలపై ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలను ప్రాసిక్యూట్‌ చేయాలి.
– వడ్డీ రేట్లను నియంత్రించే హక్కు ఉండాలి.
– మనీలెండింగ్‌ను నియంత్రించే చట్టంలో ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలను చేర్చాలి.
– వేధింపులు, ఆత్మహత్యలను ప్రోత్సహించడంపై ప్రాసిక్యూట్‌ చేయాలి.
– వడ్డీ రాయితీ, తక్కువ వడ్డీ క్రెడిట్‌ కోసం బడ్జెట్‌ మద్దతును పెంచాలి.8బులా బిల్లు ఆపాలి.
– ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేయాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad