- కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు ఆందోళన
నవతెలంగాణ-మణుగూరు: మండలంలోని రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కరెంట్ షాక్ తో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు, పాఠశాల శానిటేషన్ వర్కర్ భూక్య గౌరీ శనివారం ఉదయం మరణించారు. విధి నిర్వహణలో భాగంగా ఉదయమే పాఠశాలను శుభ్రం చేసి వంట చేయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నీళ్లు పట్టేందుకు మోటార్ ఆన్ చేయటానికి ప్రయత్నించగా కరెంట్ షాక్ కొట్టి మరణించింది. విషయం తెలుసుకున్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ కార్మికులు విధులు బహిష్కరించి ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. సిఐటియు నాయకత్వం మృతదేహాన్ని సందర్శించి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి జీలకర పద్మ ఆధ్వర్యంలో… వంద పడకల ఆసుపత్రి ముందు రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో పాటు మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం ఎంఈఓ ఎంపీడీఓ లు హెచ్ఎం తో చర్చలు జరిపారు. కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జిలకర పద్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మృతురాలి కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మృతురాలి కుటుంబ సభ్యులకు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్ గా, శానిటేషన్ వర్కర్ గా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు, దీంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అతిరం నుండి లక్ష రూపాయలు పరిహారంగా కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం అందించారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస రావు, మండల కన్వీనర్ ఉప్పుతల నరసింహారావు, జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, నాయకులు కొమరం కాంతారావు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు నాయకురాలు ఎన్ శైలజ బండారు సారిక, ఎస్ పద్మ, రమాదేవి ఎస్.కె గౌసియా బేగం, చంద్రమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు