– ప్రయోగించిన యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు
– ఎనిమిది మందికి గాయాలు
– ఎయిర్‌పోర్టులో కార్యక్రమాలకు ఆటంకం
– తాజా ఘటనతో ఇజ్రాయిల్ అధికారుల్లో ఆందోళన
టెల్ అవీవ్: ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్‌లో గల కీలక ఎయిర్‌పోర్ట్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆదివారం ఉదయం క్షిపణి దాడి జరిగింది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఈ క్షిపణి విమానాశ్రయ టెర్మినల్ 3కు కేవలం 75 మీటర్ల దూరంలో పడింది. విమానాశ్రయం యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న తోటలో ఈ క్షిపణి పడింది. దీంతో అక్కడ 25 మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడింది. ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ క్షిపణి దాడితో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. విమాన సర్వీసులకు అంతరాయమూ కలగలేదు. విమానాశ్రయంలో కార్యక్రమాలకు దాదాపు గంట సేపు ఆటకం కలిగినట్టు ఇజ్రాయిల్ పౌర విమానయాన అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ప్రయాణికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
అయితే నాలుగు అంచెల ఇజ్రాయిల్ వాయు రక్షణను దాటుకుని, దేశంలోని అత్యంత సున్నితమైన విమానాశ్రయం పరిసరాల్లో క్షిఫణి పడటం ఇజ్రాయిల్ అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నది. క్షిపణిని అడ్డుకునేందుకు తాము చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, విమానాశ్రయంలో పడిన తర్వాత దట్టమైన పొగలు అలుముకున్నాయని ఇజ్రాయిల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి. క్షిపణిదాడి తర్వాత ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ మాట్లాడుతూ… ‘మాకు హాని కలిగించేవారిని తిరిగి ఏడు రెట్లు దెబ్బతీస్తాం’ అని హెచ్చరించారు.
గాజా స్ట్రిప్‌పై సైనిక కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయాలా.. వద్దా.. అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఇజ్రాయిల్ క్యాబినేట్ మంత్రుల సమావేశానికి ముందు ఈ క్షిపణి దాడి జరగడం విశేషం. ఆదివారం సాయంత్రం ఆ సమావేశం జరగాల్సి ఉన్నది. ఈ దాడిపై హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయిల్ విమానాశ్రయంపై తమ బృందం హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని తెలిపారు. ఈ క్షిపణిదాడి తర్వాత అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను ఇజ్రాయిల్‌కు రద్దు చేశాయి. అలాగే ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు ఆదివారం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని అబుదాబికి మళ్లించారు. మళ్లించిన ఈ విమానం ఏఐ139.. అబుదాబీ నుంచి ఢిల్లీకి తిరిగివస్తుందని ఎయిరిండియా తెలిపింది. అదేవిధంగా, ఈ నెల 6 వరకూ టెల్‌అవీవ్‌కు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. తమ వినియోగదారుల భద్రత, సిబ్బంది రక్షణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ఇజ్రాయిల్ విమానాశ్రయంపై క్షిపణి దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES