నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ… దేవుడి పక్కన దెయ్యాలు ఉంటే కవిత 12 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టుగా… 1,200 మంది అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ఫలితాలను ఒక్క కుటుంబం మాత్రమే అందుకుందని విమర్శించారు. పదేళ్ల తర్వాత ఆ కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్న తరుణంలో వాళ్లలో వాళ్లే ఒక నాటకం ఆడుతున్నట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు.
తండ్రీ కూతుళ్లకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకని రఘనందన్ రావు ప్రశ్నించారు. తండ్రీ కూతుళ్లు మాట్లాడుకునేందుకు ఫోన్‌లు లేవా?, బిడ్డ ఇంటికి వస్తానంటే తండ్రి వద్దంటాడా?… అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి కవిత బయటకు వెళ్దామని ఫిక్స్ అయిందని… సొంత అజెండాతో కొత్త పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయినట్టుగా కనిపిస్తుందని అన్నారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టొచ్చని చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల తరహాలోనే కవిత కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందని అన్నారు.

తెలంగాణ జాగృతి నేతలతో మంగళవారం ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సింగరేణి ప్రాంత జాగృతి నేతలతో కవిత భేటీ నిర్వహించారు. తాజా పరిణామాలు, జాగృతి తరఫున చేపట్టే కార్యక్రమాలపై ఈ సమావేశంలో వారితో ఎమ్మెల్సీ కవిత చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు వస్తున్న ఊహాగానాలను మరింత బలం చేకూరినట్లయింది. ఆమె త్వరలోనే పార్టీని వీడి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.