Monday, May 5, 2025
Homeజాతీయంరైతు నేత రాకేశ్‌ తికాయత్‌పై మూక దాడి

రైతు నేత రాకేశ్‌ తికాయత్‌పై మూక దాడి

- Advertisement -

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతు నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ పై జరిగిన మూక దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన తికాయత్‌పై సంఘపరివార్‌ శక్తులు బరితెగించాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి నిరసనగా ఆక్రోశ్‌ ర్యాలీలో తికాయత్‌ పాల్గొన్నారు. ఉగ్రదాడిని నిరోధించడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నించడానికి, హిందూ-ముస్లిం ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పడానికి వేదికపైకి వచ్చిన తికాయత్‌పై అప్పటికే అక్కడే మాటు వేసిన హిందూత్వ సంఘాల సభ్యులు భౌతికంగా దాడి చేశారు. ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా మొత్తం దేశాన్ని ఏకం చేయడానికి బదులుగా, ఒక సమూహం ‘మోడీ మోడీ’ అని నినాదాలు చేస్తూ టికాయత్‌పై దాడి చేశారు. ఈ ఘర్షణలో తికాయత్‌పై జెండా కట్టిన కర్రలతో దారుణంగా దాడి చేశారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారులు చోద్యం చూశారు. ఆ దాడిని ఆపడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ దాడిని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం), అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడిన వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని, ఉత్తరప్రదేశ్‌లో అడవి రాజ్యాన్ని అంతం చేయాలని డిమాండ్‌ చేశాయి. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కూటమి దేశ వ్యతిరేక, నయా ఫాసిస్ట్‌ విధానాన్ని బహిర్గతం చేసిందని విమర్శించాయి. ఎస్కేఎం నాయకుడిపై జరిగిన దాడిని ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖండించకపోవడం, నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వకపోవడం దారుణమన్నారు.
ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న కోపాన్ని ఉపయోగించుకుని దేశంలోని మైనారిటీలు, రైతులు, కార్మికులు, లౌకిక, ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టే ప్రగతిశీల వర్గాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కూటమి ప్రయత్నిస్తోందని విమర్శించాయి. కర్నాటకలోని మంగళూరు, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో సంఫ్‌ు పరివార్‌ సహా మితవాద మత సంస్థలు ఇద్దరు ముస్లిం యువకులను దారుణంగా హత్య చేశాయని పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో కాశ్మీరీ విద్యార్థులు, వ్యాపారులు ప్రాణాలకు ముప్పు ఎదుర్కొంటున్నారని తెలిపాయి. మైనారిటీలు, రైతులు, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి చేస్తున్న విభజన, హింసాత్మక ప్రచారాన్ని బహిర్గతం చేయాలని ఎస్కేఎం అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కూటమి కింద సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ ఉగ్రవాద శక్తులు, నయా ఫాసిస్ట్‌ శక్తులు జాతీయ ఐక్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్న ఈ తరుణంలో అన్ని వర్గాల ప్రజా, వర్గ సంఘాలు కలిసి పనిచేయాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. దేశ ప్రజల లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని కాపాడటానికి, ప్రజల ఐక్యతను బలోపేతం చేయడానికి గ్రామీణ, పట్టణ స్థాయిలలో సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో ప్రచారాలను నిర్వహిస్తామని ఎస్కేఎం పేర్కొంది. రైతు నేత తికాయత్‌పై జరిగిన పిరికిపందల దాడిని ఏఐకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజ్జూ క ృష్ణన్‌ విమర్శించారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి, విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసే వారందరికీ ప్రభుత్వం రక్షణ కల్పించడం అత్యవసరమని అన్నారు. రాజ్యాంగ హక్కులైన భావ ప్రకట నా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల నిర్వహణను హిందూత్వ సంఘాలు ప్రమాదకరంగా దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. తికాయత్‌పై జరిగిన దాడిని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులు ఖండించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -