– ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తరువాత దేశంలో పౌరుల రక్షణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం బుధవారం దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్‌ను నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ కోసం ప్రోటోకాల్‌ను ఖరారు చేయడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాతాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సివిల్ డిఫెన్స్ అధిపతులతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్ డైరెక్టర్స్ జనరల్‌తో సహా పలు కీలక కేంద్ర బలగాలు, ఏజెన్సీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొంత మంది అధికారులు రక్షణ యంత్రాంగంలోని ‘లొసుగులు’ను గుర్తించినట్లు ఇతర అధికారులు తెలిపారు. ‘మేం మాక్ డ్రిల్స్ ఏర్పాట్లను సమీక్షించాం. కొన్ని లొసుగులను గుర్తించాం’ అని ఎన్‌డీఎంఎ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, ఈ నెల 7న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో కూడిన పౌర రక్షణ విన్యాసాలు నిర్వహించాలని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక సలహాను జారీ చేసింది. దేశవ్యాప్తంగా 244 గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో వీటిని నిర్వహిస్తారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా యుద్ధ సమయ పరిస్థితులతో సహా వివిధ ముప్పులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నవి ఉన్నాయి. అలాగే మాక్ డ్రిల్స్‌ను శత్రుదాడులు లేదా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పౌర రక్షణ యంత్రాంగాల సంసిద్ధతను అంచనా వేయడానికి, మెరుగుపరచ్చడం వంటి ప్రధాన లక్ష్యాలతో నిర్వహిస్తారు.
నేడు మాక్ డ్రిల్స్
- Advertisement -
- Advertisement -