ఆకాశం ఎల్లలు దాటి పరుగులు తీస్తోన్న నేటి శాస్త్ర సాంకేతిక ప్రగతిలోనూ ఆధునిక మహిళ కొన్ని సంకెళ్లు తెంచుకోనూలేక, ఉంచుకోనూలేక తెగ ఘర్షణ పడుతోంది. రక్షణ రంగంతో సహా అన్ని రంగాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించామని మన పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని మీడియా ఊదరగొడుతోంది. అదే సమయంలో మహిళలు కుటుంబ సంబంధాల దగ్గరకొచ్చే సరికి, సమస్యలను సరైన రీతిలో పరిష్కరించుకోలేక ఘర్షణకు లోనవుతున్నారు.
ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఇష్టంలేని పెండ్లికి తలవొగ్గి, తర్వాత తాము ఇష్టపడ్డ వ్యక్తులతో వెళ్లిపోతున్న సంఘటనలు బాగా జరుగుతున్నాయి. అంటే తమకు నచ్చిన వారితో జీవితాన్ని పంచుకునే స్వేచ్ఛ, స్వాతంత్రం మహిళలకు ఇంకా రానట్టే కదా! చట్ట పరంగా మేజర్స్ అయిన యువతీ, యువకులు నచ్చిన వాళ్ళని పెండ్లి చేసుకునే హక్కు ఉన్నా కులం, మతం, ప్రాంతం, ఆస్తి, అంతస్థు, పెద్దల అంగీకారం అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఒకవేళ వీటన్నిటిని ధిక్కరించి పెండ్లి చేసుకున్నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే పరువు పోయిందనే కక్షతో, కన్న బిడ్డలనే చంపేసే సంఘటనలు కోకొల్లలు. దీంతో తల్లిదండ్రులను ఒప్పించలేక, పెండ్లికి ఒప్పుకుని తర్వాత తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొన్ని పిచ్చి నిర్ణయాలతో హంతకులుగా మారి పోలీసులకు చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇలాంటి సంఘటనలలో మహిళదే తప్పా! పురుషుడి పాత్ర లేదా!? ఎందుకు మహిళనే దోషిగా చూపుతున్నారు! జర్నలిజంలో ఓ పెద్దాయన ‘మనిషి కుక్కను కరిస్తే వార్త.. కుక్క మనిషిని కరిస్తే వింత ఏముంది!’ అని అన్నాడట. అలాగే భారతీయ సమాజంలో భర్త, భార్య పిల్లలను హింసిస్తే అది వార్త కాదు! అది సామాజిక ఆమోదం పొందిన తరతరాల సంప్రదాయం. ఇంటి యజమాని అయిన భర్త, కుటుంబాన్ని పోషించే వాడు, భార్య బిడ్డలను అదుపులో ఉంచడానికి అప్పుడప్పుడు నాలుగు దెబ్బలేస్తే తప్పు లేదంటారు. భార్య ఎవరితోనై సంబంధం పెట్టుకుందని తెలిస్తే నడిరోడ్డు మీదే నరికేసినా ఎవ్వరూ ఆశ్చర్యపోరు. కానీ అదే పని భార్య చేస్తే బ్రహ్మాండం బద్దలై పోతుంది. అలాగే కొందరు మహిళలు భర్తతో విసిగిపోయి పిల్లలతో సహా బలవర్మరణాలకు పాల్పడుతున్నారు. కొందరు తండ్రులు పిల్లలు తనకు పుట్టిన వాళ్లేనా అనే అనుమానంతో వాళ్ళ పీకలు కోస్తున్నారు! ఇలాంటి దారుణాలన్నీ కుటుంబ సంబంధాలలోనే జరుగుతూ సమాజాన్ని దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే… ఎటువంటి పరిస్థితుల్లో మహిళలు హింసాయుత చర్యలకు దిగుతున్నారనేది అర్ధం చేసుకోవాలి. మహిళలు యుక్త వయసు వచ్చేవరకు తండ్రి సంరక్షణలోనూ, వివాహమయ్యాక భర్త సంరక్షణలోనూ జీవించాలని, భర్త, పిల్లలకు చాకిరీ చేయడమే ధర్మమనే సంప్రదాయ భావజాలం ఎన్నో తరాలుగా మనలో కొనసాగుతోంది. రాజారామ్ మోహన్ రారు, కందుకూరి, గురజాడల వంటి సంఘ సంస్కర్తలతో బ్రిటిష్ వారి పాలనలో మొదలైన స్త్రీ విముక్తి ఉద్యమం నేటి ఆధునిక మహిళ రూపుదిద్దుకోవడానికి తోడ్పడింది. అలాగే ‘స్త్రీ స్వేచ్ఛ’, ‘స్త్రీ పురుష సమానత్వం’ అనే నినాదాలు ప్రగతిశీల మహిళా ఉద్యమ నినాదాలు మాత్రమే కావు. అవి ప్రధానంగా పెట్టుబడి తన అవసరాలకోసం తీసుకొచ్చినవే! జనాభాలో యాభై శాతం శ్రమ శక్తి అయిన మహిళలు పరదాల చాటున, వంటింట్లో చాకిరీ చేయడాన్ని పెట్టుబడిదారి సమాజం చూస్తూ సహించలేదు! అందుకే ప్రజల ఫ్యూడల్ భావజాలంలో మార్పు కలిగేలా ”తర తరాల కుటుంబ వ్యవస్థ’, ‘స్త్రీ పురుష సంబంధాలు’, వివాహ బంధం” మొదలైన వాటి మీద సాంస్కృతిక యుద్ధాన్ని ప్రకటించింది. అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల టీవీ, స్మార్ట్ ఫోన్, ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలు ఆ యుద్ధంలో పెట్టుబడి ఆయుధాలవుతున్నాయి.
ఒకవైపు మహిళా విద్యకు ప్రొత్సాహం, వారికి ఉద్యోగావకాశాలు, అన్ని రంగాలో వారిని భర్తీ చేసుకోవడం, మరో వైపు వారి ఆలోచనలను సంప్రదాయ సంకెళ్లు తెంచుకునే దిశలో భావజాల ప్రచారం ఓ పధకం ప్రకారం సాగుతోంది. మహిళ విముక్తి ముసుగులో, ఏ కుటుంబ సంబంధాలు లేని ఒక కార్పొరేట్ శ్రామిక మహిళను సృష్టించాలని పెట్టుబడిదారీ ప్రచార సాధనాలు పని చేస్తున్నాయి. ఆధునిక మహిళలకు నమూనాగా అటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. వంటింట్లో వుండే మహిళ టీవీ, సినిమా, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లతో ఇటువంటి ప్రచారానికి ప్రభావితమవుతున్నారు. ఇప్పటికి సంప్రదాయ వివాహ వ్యవస్థ, కుల, మత, కుటుంబ వ్యవస్థలు బలంగా ఉండడంతో కొత్త భావజాలంతో ముందుకెళ్లాలనుకునే స్త్రీ, పురుషులు ఘర్షణకు లోనవుతున్నారు. ఈ ఘర్షణ నుండే మనం చర్చించిన అవాంఛనీయ దారుణాలు సంభవిస్తున్నాయి.
అంతిమంగా ఈ రోజు వివాహ వ్యవస్థ, కుటుంబ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలలో ఎదుర్కొంటున్న కుదుపులకు భారత దేశంలో ఆధిపత్యం వహిస్తోన్న సామ్రాజ్యవాద క్షీణ సంస్కృతికి వున్న లింకును ప్రజలందరూ అర్ధం చేసుకోవాలి. తిరోగమన, అసమాన సంబంధాలకు, వివాహ, కుటుంబ వ్యవస్థలకు ప్రత్యామ్నాయం పెట్టుబడిదారీ బూటకపు స్వేచ్ఛ కాదు! స్త్రీ స్వేచ్ఛ అంటే ఉన్నతమైన మానవీయ విలువలు, ఆదర్శాలు,స్నేహ పూరిత సంబంధాలతో కూడిన స్వేచ్చాయుతమైన, ప్రజాస్వామీకరించిన కుటుంబ, వైవాహిక, స్త్రీ పురుష సంబంధాల సాధనకు కృషి చేయాలి. ఈ పెట్టుబడి దారి దోపిడీవ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సోషలిస్టు సమాజం సాధించే క్రమంలోనే అటువంటి చైతన్యపూరిత సంబంధాలు సాధించగలం. ఫ్యూడల్ వ్యవస్థకు, పెట్టుబడి దారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సాహితీ , సాంస్కృతిక సంఘాలు, పార్టీలు ప్రధానంగా యువత మీద కేంద్రీకరించి ఈ అవాంఛనీయ, వికృత క్షీణ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం నిర్వహించాలి. యువతలో వుండే జీవశక్తిని ఈ ప్రచార సాధనాలు, సోషల్ మీడియాలు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించాగలగాలి. పెట్టుబడిదారీ ఆధునిక స్త్రీ, పురుషుల నమూనాకు ప్రత్యామ్నాయంగా సోషలిస్టు నమూనా దిశగా వాళ్ళను మళ్లించాలి.
– సత్యభాస్కర్ ఆత్కూరు,
9848391638