Friday, May 2, 2025
Homeజాతీయంహక్కులను కాలరాస్తోన్న మోడీ సర్కార్‌

హక్కులను కాలరాస్తోన్న మోడీ సర్కార్‌

– లేబర్‌ కోడ్స్‌తో 12 గంటల పని విధానం…దీనికి వ్యతిరేకంగా పోరాడుదాం
– మే 20న సమ్మెలో కార్మికులందరూ భాగస్వాములవ్వాలి : మేడే వేడుకల్లో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్‌ కాలరాస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. 136వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకుని గురువారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఎకేజీ భవన్‌)లో ఆయన ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ చికాగో కార్మికులు పోరాడి సాధించిన హక్కులను నేడు పాలకవర్గాలు, పెట్టుబడిదారీ వర్గం లాక్కుంటున్నాయని విమర్శించారు. 1886లో ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాడి సాధించుకున్న హక్కులను లేబర్‌కోడ్స్‌తో హననం చేస్తున్నారని విమర్శించారు. ఈ లేబర్‌కోడ్స్‌తో 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానం అమలుకు మోడీ సర్కార్‌ పూనుకుందని ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో సీఐటీయూతో పాటు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాల పిలుపులో భాగంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కార్‌ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలు అమలుచేస్తోందని విమర్శించారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించటం లేదని, మరోవైపు వారికి పోరాడే హక్కు కూడా లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, తపన్‌ సేన్‌, మరియం దావలే, విజూ కృష్ణన్‌, కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్‌, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు హన్నన్‌ మొల్లా తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ కేంద్ర కార్యాలయం (బీటీఆర్‌ భవన్‌)లో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ పాల్గొన్నారు. అలాగే పి.రామ్మూర్తి భవన్‌లో సీఐటీయూ జాతీయ కార్యదర్శి స్వదేశ్‌ దేవ్‌ రారు జెండా ఆవిష్కరించారు. జాతీయ ఉపాధ్యక్షులు ఆర్‌. లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా మే 20న జరిగే సమ్మెకు కార్మికవర్గం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం (ఎకేజీ సెంటర్‌)లో రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌ మాస్టర్‌ జెండాను ఎగుర వేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బిజు కందకైతో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కొట్టాయంలో జరిగిన ర్యాలీలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్‌ పాల్గొన్నారు. త్రిపురలోని అగర్తలాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జితిన్‌ చౌదరి జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాల గురించి వివరించారు. దీనిపై పోరాటానికి కార్మికులు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ బహిరంగ సభ నిర్వహించింది. అలాగే సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మెన్‌ బిమన్‌ బసు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు సూర్యకాంత్‌ మిశ్రా పాల్గొన్నారు. తమిళనాడులోని మధురైలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో మాజీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రామకృష్ణన్‌ జెండా ఆవిష్కరించారు. అలాగే దిండిగల్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు యు.వాసుకి జెండాను ఆవిష్కరించారు. రాజస్థాన్‌లో హనుమగఢ్‌ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. హర్యానాలోని రోహతక్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నేత సురేంద్ర సింగ్‌ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత హరిలాల్‌ యాదవ్‌ జెండా ఆవిష్కరించారు. అలాగే చికాగో అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) జెండాను రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఆవిష్కరించారు. ఆంధప్రదేశ్‌లోని విజయవాడలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు జెండాను ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img