Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోడీ

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోడీ

- Advertisement -

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
– సీపీఐ జనగామ జిల్లా 4వ మహాసభ ప్రారంభం
నవతెలంగాణ – జనగామ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌, పెట్టుబడిదారులకు ప్రజల సంపదను దారాధత్తం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో సీపీఐ జనగామ జిల్లా 4వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. గత పదేండ్లలో దేశంలో తలసరి ఆదాయం రెట్టింపు అయితే ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆపలేకపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి రాక ముందు కేవలం రూ.50 లక్షల కోట్లు ఉన్న అప్పు నేడు రూ.160 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. పేదరికం, నిరుద్యోగం రెట్టింపు అయ్యాయని, ఇండ్లు లేని నిరుపేదలు పెరిగిపోయారని చెప్పారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషించిన బీజేపీ యుద్దోన్మాదానికి తెరలేపిందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం పేరు మీద ధనస్వామ్యం, భూస్వామ్యం, ఫాసిజం రాజ్యమేలుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్త కోటీశ్వరులకు రైట్‌ ఆఫ్‌ లోన్స్‌ పేరుతో రూ.16.35 లక్షల కోట్లు రద్దు చేయడాన్ని ప్రశ్నించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు రైతు పెట్టినటువంటి పెట్టుబడికి రెట్టింపు మద్దతు ధర ఇవ్వాలని అన్నారు. దానికి కేవలం రూ.119 లక్షల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. ఆపరేషన్‌ కగార్‌ ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. దశాబ్దాలుగా ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటాలను సీపీఐ నిర్వహించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పాతూరి సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్‌, చొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, జువారి రమేష్‌, పాతూరి రమేష్‌, జీడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad