– ఏకపక్షంగా.. విదేశాలకు పంపే ఎంపీల ఎంపిక జాబితా
– తానే అధికారపక్షం.. ప్రతిపక్షంలా మోడీ తీరు
– బీబీనగర్ ఎయిమ్స్‌పై కేంద్రం నిర్లక్ష్యం : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, ఆపరేషన్ సిందూర్ ప్రక్రియ అనంతరం ఉగ్రవాదుల పట్ల భారతదేశ వైఖరి తెలిపేందుకు విదేశాలకు పార్లమెంట్ సభ్యులను పంపే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాన్ని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ.. ఉగ్రవాదం పట్ల భారతదేశం వైఖరిని ప్రపంచానికి తెలియజేసేందుకు విదేశాలకు పంపుతున్న ఎంపీల బృందంలో ప్రతిపక్ష పార్టీలు తమ జాబితా పంపినప్పటికీ.. పట్టించుకోకుండా ఆయా పార్టీల సభ్యులను సైతం తానే ఎంపిక చేయడం ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయడమేనని చెప్పారు. ఆయా పార్టీలు నిర్ణయించిన సభ్యులను కాదని కేంద్ర ప్రభుత్వం సొంతంగా పార్లమెంట్ సభ్యుల జాబితాను సిద్ధం చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు విలువలేదని, మోడీ ప్రభుత్వం తానే ప్రతిపక్షం, అధికార పక్షంలా వ్యవహరిస్తూ నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యుల ఎంపికను కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ తప్పు పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశ వైఖరిని విదేశాలకు తెలియజేయడం ఒక భాగం అయితే.. మన భారతదేశంలో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు చెప్పకుండానే.. పార్లమెంట్‌లో ప్రస్తావించకుండానే విదేశాలకు పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ సభ్యుల విదేశాలకు పంపించే సభ్యుల ఎంపిక మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే ప్రతిపక్షాల పట్ల, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం లేదని స్పష్టమవు తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజాస్వామ్యవా దులందరూ గమనించాలన్నారు. కేంద్రం వైఖరిని ఎత్తిచూపాల్సిన అవసరముందని చెప్పారు.
ఎయిమ్స్‌పై కేంద్రం నిర్లక్ష్యం
స్థానికంగా ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రి నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని రాఘవులు విమర్శించారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి రోగులకు సేవలందిస్తుంటే.. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి వచ్చిన రోగులను గాంధీకి తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు ఏం మాట్లాడరు.. నిధులు కేటాయించరని విమర్శించా రు. ఆస్పత్రిలో 750 మంచాలు ఉంటే.. 250 మంది పేషెంట్స్ మాత్రమే ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారని అన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని, ఈ పరిస్థితి ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఒకచోట ఒక విధంగా, మరోచోట మరో విధంగా ఉండటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు.
ఒకే దేశం.. ఒకే ఎన్నికను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సీపీఐ(ఎం)
ఎన్నికలు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని, ఎన్నికలు జరిగితే విపరీతంగా ఖర్చు అవుతుందని.. అందుకే ఒకే దేశం.. ఒకే ఎన్నిక జరపాలని హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రులు పేర్కొనడం హాస్యాస్పదమని రాఘవులు అన్నారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశలుగా నిర్వహించారని, ఒకేసారి దేశమంతటా ఒకటే రోజు ఎందుకు నిర్వహించలేకపోయారని ప్రశ్నించారు. ఒక ప్రాంతంలో ఒకసారి నిర్వహించిన ఎన్నికల సామగ్రిని, పోలీస్ సిబ్బందిని మరొక ప్రాంతంలో మరొక దశలో ఉపయోగించుకుంటూ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల పోలింగ్ బూత్‌ల సంఖ్యను, ఎన్నికల ఎలక్ట్రానిక్ మిషన్స్, భద్రపరిచే గదులు, పోలీస్ వ్యవస్థను పెంచుకోవాల్సిన అవసరం లేదా? ఆ ఖర్చు పెరగదా, ఎన్నికలను ఖర్చుల పేరుతో చూడటం ప్రజాస్వామ్యంలో బాధాకరమన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఏం చూసి ఓట్లు వేయాలనేది నిర్ణయించు కుంటారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విధంగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విధంగా, ప్రాంతీయ ఎన్నికల్లో ఒక సమస్యను ఎంచుకొని ఓటర్ తమ తీర్పును తెలియజేస్తారని వివరించారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికపై సీపీఐ(ఎం)గా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని, ప్రజలందరూ బీజేపీ విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
మోడీ వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES