నవతెలంగాణ-హైదరాబాద్: లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు లక్నో ఓటమి పాలైంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను షమీ ప్రారంభించాడు. తొలి బంతికే ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఔట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీయడం షమీకి ఇది ఐదోసారి. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ జాబితాలో షమీ తర్వాత ఏడుగురు బౌలర్లు తలో మూడుసార్లతో రెండో స్థానంలో ఉన్నారు. వారిలో ప్రవీణ్ కుమార్, ఉమేశ్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, అశోక్ దిండా, ప్యాట్ కమ్మిన్స్ ఉన్నారు.



