Sunday, May 18, 2025
Homeఎడిట్ పేజి''అంతకంటే'' అంతే..

”అంతకంటే” అంతే..

- Advertisement -

సరిగా గుర్తులేదు కాని మా మిత్రుడు ఏదో విషయం గురించి చెప్పాడు. ఆయనకంటే ఈయనే మేలురా అనీ అన్నాడు. అంతే అన్నాను సమాధానంగా. ఇంకొకటీ చెప్పి దాని గురించీ అడిగాడు. అప్పుడే అంతే అని ఉన్నాను కాబట్టి ”అంతకంటే” అంతే అన్నాను. నవ్వాడు. ఇంతకూ ఈ ప్రయోగం ఎక్కడినుండి వచ్చిందబ్బా అని ఆలోచిస్తే మహాకవి శ్రీశ్రీ ఒకసారి స్త్రీ పురుషులు సమానమేనా అని ఎవరో ప్రశ్నిస్తే, ఇద్దరూ సమానమే కాని పురుషులు ”ఇకొంచం ఎక్కువ” సమానం అన్నాడు. ఈ మధ్యే ఒక పుస్తకంలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు సమానమా అన్న ప్రశ్నకు సమానమే కాని తెల్లవాళ్ళు ఇంకొంచం ఎక్కువ సమానం అని చదివాను. అది మహాకవి చెప్పినదానికంటే ముందరిది. ఆ కొటేషన్‌ ఆయనకు స్ఫూర్తినిచ్చి ఉండొచ్చు లేదా ఆ మాటలు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఏమైతేనేం ఒక మంచి ఆలోచనను రేకెత్తించే మాటలు ఆయనవి. అందుకే మహాకవి ఆయనే కదా అంటే అంతే అనాల్సిందే. అంతకంటే అంతే అనేలాగ ఇంకొకరు తయారు కావడం కష్టాతి కష్టం.
ఫలానా మోటార్‌ సైకిల్‌ కొంటే ఎలా ఉంటుంది అనడిగితే బాగుంటుందనో అది నాకిష్టంలేదు ఇంకొకటి కొను అనో సమాధానం ఇవ్వాలి. మౌనంగా ఉంటే, ఎందుకు పలకవ్‌ బాగుంటుంది కదా అని దామోదర్‌ అంటే, అంతే అదే కొను అని సీను సమాధానమిచ్చాడు. మామూలుగా అంతే అంటే చాలు కాని దానికి కొన్ని మాటలు కలిపి చెప్పొచ్చు కూడా. ఈ ”అంతే” అన్న సమాధానం అన్ని రకాల ప్రశ్నలకు, అన్ని రకాల భావాలకు కూడా చక్కగా సరిపోతుంది. వీణ్ణెవడూ బాగుపరచలేడు అన్నారనుకొండి, సమాధానం అంతే అని సరిపెట్టవచ్చు. వాణ్ణి అలాగే వదిలేస్తే ఎలా, ఎవరో ఒకరు సరిచేయాలి కదా అనీ సలహా ఇవ్వొచ్చు. దీనివల్ల సంభాషణ పెరిగి అదెక్కడికి దారితీస్తుందో అనుకుంటే ”అంతే” అనడం ఉత్తమం. పొడిగించడం ఇష్టం లేనప్పుడు, ఇంక ఆ విషయానికి సమయం కేటాయించడం వద్దు అనుకున్నప్పుడు ఈ ”అంతే” సరిపోతుంది. అసలు ఈ ”అంతే” అన్నది ఒకె పదమైనా ఒక స్టేట్మెంటు కూడా అని మరువరాదు.
అసలు అంతే, అదంతే అన్న నిర్ణయానికి మనుషులెప్పుడు వస్తారు అన్నది ముఖ్యం. కొందరు మాత్రం అన్నం మొత్తం చూడపనిలేదు ఒక్క మెతుకు చూస్తే చాలదా అన్నట్టు ఒక్కసారికే విషయాలమీద, జనాలమీద, నాయకులమీద, పార్టీలమీద నిర్ణయాలు చేసేస్తుంటారు. కొందరు ఇంకొక్క ఛాన్సు ఇస్తారు. ఇంకొందరు చాలా ఛాన్సులిస్తారు. ఈ మూడు రకాల మనుషులు మనకు మూడుచేపల కథను గుర్తు చేస్తాయి. ఈ కథను పిల్లలకు తప్పకుండా చెప్పండి, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఈ అంతేను కూడా అంతే, అదంతే, అదెప్పుడూ అంతే అని మనమూ పేర్లు పెట్టుకోవచ్చు. మన జీవితాలను వెంటనే ప్రభావితం చేసేవాటిమీద మొదటి చేపలా, ఫరవాలేదు అనుకుంటే రెండో చేపలాగా, అంత ఎక్కువ ప్రమాదం లేదు అనుకుంటే మూడో చేపలాగా ఉండాలి. కానీ మూడో చేపకు సడెన్‌గా వర్షం వస్తే తప్ప చెరువులోకి నీళ్ళురావు. అలా వచ్చేది చాలా తక్కువ సందర్భాల్లో కాబట్టి రెండో చేపవరకూ మనం ఫాలో కావచ్చు. మూడో చేపవరకూ పోకూడదు. ఎటూ చేపల గురించి అనుకుంటున్నాం కాబట్టి రాజకీయ చేపల గురించీ కాస్త చెప్పుకోవాలి. నీళ్ళున్న చెరువులో ఉన్నా చెంగుచెంగున చెరువులు మారే చేపలను మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఎక్కువ నీళ్ళుంటే అక్కడికి పోతాయవి.
ఆంజనేయుడి కార్టూన్‌ సీరియల్సులో, ఏ సూపర్‌ మ్యాన్‌, శక్తిమాన్‌ లాంటి కామిక్స్‌లో రాక్షసుడో, విలనో, లేదా పెద్ద తిమింగలమో ఎదురొస్తే, ఆ అంశాన్ని మిత్రులకు చెప్పేటప్పుడు వాటిల్లోని హీరో ఇంత, ఈంత పెద్దగా మారి ఫైటింగ్‌ చేస్తాడని చేతులతో చూపిస్తుంటారు. పెద్దోళ్ళు కూడా అలాగే చెబుతారు. ఇంతై వటుడింతై అన్న పద్యం కూడా ఇప్పుడు చెప్పుకుంటున్న సూత్రం ప్రకారమే ఉంది. ఇంతై, అంతై, ఇంతింతై, అల్లంతై అన్న ప్రయోగాలనూ చూస్తాం మనం. కాబట్టి ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా చెప్పే నేర్పు కవికుండాలి.
అంతొద్దు…ఇది చాలు, అంతే…అంతే, అంతేగా…అంతేగా మొదలైన డైలాగులు సినిమాల్లో చూశాము. దీన్నిబట్టి తెలిసేదేమంటే ఈ అంతే, అంతలను ఏదో ఒక విధంగా జనాల నోళ్ళలో నానిస్తున్నారు. కొందరు దాన్ని తమాషాకి, వ్యంగ్యానికి వాడితే ఇంకొందరు సీరియస్సుగా వాడుతున్నారు. ఈ అంతే అన్నదాంట్లో పలికేదాన్ని బట్టి అర్థం మారిపోతుంది. అంతే అంటే ఒక అర్థం, అంతే అనుకో అంటే మరో అర్థం వస్తాయి. రెండుసార్లు పలికితే అదొక అర్థం. ఈ ప్రయోగాలన్నీ చూస్తే ఈ అంతకు అనంతమైన అర్థాలున్నాయని అనిపిస్తుంది. అది వాడుకునేవారి రుచిని బట్టి అంటే టేస్టును బట్టి ఉంటుంది. ఫెయిలైన సినిమాని కూడా ఇంత విజయం సాధిస్తుందనుకోలేదని, అంత మార్కెట్‌ తెస్తుందనుకోలేదని, పిచ్చరు ఎంతో బాగా వచ్చిందని నోటికొచ్చిందంతా చెప్పే సభలను కూడా మనం చూశాం. కాబట్టి అబద్దానికైనా, నిజానికైనా కూడా అంతే పవరుంటుందని చెప్పగలిగే మాటలనుంచి గ్రహించాలి. తెలుసుకోవాలి.
నువ్వెంతంటే అంత అనికూడా మనుషులకు కొన్ని సమాధానాలిస్తుంది. అలా అంటే అవతలివారు కాస్త పొంగిపోతారు కూడా. అంటే నన్ను పూర్తి బలపరుస్తున్నారు అనుకుంటారు. అదే సందర్భంలో నువ్వన్నదానికి ఇంకొంత కలిపి మాట్లాడితే మాట మాట పెరిగి అదెక్కడికో పోవచ్చు, అందుకే నువ్వెంతంటే అంత అని అనేవాళ్ళలో జారుకునే లక్షణమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫీసులో బాసు మాటలకైతే మీరెంతంటే అంత మేడం అనో, సార్‌ అనో అనేస్తే ఇబ్బందే ఉండదు. అదీ కాక ప్రమోషన్ల విషయం నడుస్తూ ఉంటే ఇంకాస్త కలిపి నిజంగా చాలా బాగా ఆలోచిస్తారు మీరు అనేస్తే ఇంకొన్ని మార్కులు అదనంగా కొట్టేయొచ్చు కూడా. అప్పుడది అనంతమైన ఫలితాలనిచ్చే పరికరంగా మారుతుంది కూడా.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి కూడా చెప్పుకోవాలంటే భారత్‌ దగ్గర అంత శక్తి ఉందా అంటే అది ఇప్పుడే కాదు ఎంతోకాలంగా ఉంది అని, ఆ విషయాన్ని ప్రపంచం ఎప్పుడో చూసింది కూడా అని చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక్కరోజులో సాధించింది కాదు.
ఈ వారానికంతే.శుభ ఆదివారం.
జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -