నవతెలంగాణ – హైదరాబాద్: తాజాగా ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో దేశానికే అత్యంత ప్రమాదకరమైన నాలుగు చట్టాలకు మోడీ సర్కారు ఆమోద ముద్ర వేసుకున్నదనీ, వాటి పరిణామాలు దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు హెచ్చరించారు. వాటికి వ్యతిరేకంగా కలిసొచ్చే శక్తులన్నింటినీ, పార్టీలను కలుపుకుని దేశవ్యాప్త పోరాటాలను నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతితో కలిసి రాఘవులు మాట్లాడారు. కార్పొరేట్లకు అధిక లాభాలు గడించేలా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కోడ్‌లతో కార్మికులు సమ్మె హక్కును కోల్పోతారనీ, ఉద్యోగ భద్రత ఉండదనీ, కనీస వేతనాల కోసం కార్మికులు బేరసారాలు ఆడే హక్కును కోల్పోతారని వివరించారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్ మెథడ్ అంటే కార్మికుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ విద్యుత్ పంపిణీ వ్యవస్థ 99 శాతం ప్రభుత్వ ఆధీనంలో నడిచేదనీ, దాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే విద్యుత్ సవరణ చట్టాన్ని మోడీ సర్కారు చేసిందని విమర్శించారు.

ఈ చట్టం వల్ల క్రాస్ సబ్సిడీ ఎగిరిపోతుందనీ, రైతులు, పేదలు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కోల్పోతారని వివరించారు. సబ్సిడీ మీద విద్యుత్ పొందుతున్న విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఆ సౌకర్యాన్ని కోల్పోతాయని తెలిపారు. కొత్త చట్టం ద్వారా విద్యుత్ లైన్లను ప్రయవేటు కంపెనీలు వాడుకునే అవకాశాన్ని మోడీ సర్కారు కల్పించిందని ఎత్తిచూపారు. అదానీ, అంబానీ, గోద్రెజ్, సుజాన్, వంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎప్పటి నుంచో పంపిణీ వ్యవస్థను తమకివ్వాలని ఒత్తిడి తేవడంతోనే మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్శించారు. తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటును రేవంత్‌రెడ్డి సర్కారు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. లాభాలు వచ్చే వాటిని ప్రయివేటు కంపెనీలకు అప్పగించి, నష్టాలు వచ్చే వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచి క్రమంగా ప్రజలకు సేవలను తగ్గించే కుట్ర దీని వెనుక ఉందని ఎత్తిచూపారు. ‘జీ రాం జీ’ చట్టం రాష్ట్రాలకు పెనుభారంగా మారబోతున్నదనీ, ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలు 40 శాతం నిధులను ఖర్చుచేయకపోతే కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులను ఆపేస్తుందని తెలిపారు. ఆ చట్టం ద్వారా దేశంలోనే ఎక్కువ పనిదినాలను వాడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోబోతున్నాయని నొక్కి చెప్పారు. గ్రామీణ భూస్వాములకు, పట్టణాల్లోని కార్పొరేట్ల సంస్థలకు కారుచౌకగా కూలీలు దొరికేలా ఈ చట్టం ఉందని ఎత్తిచూపారు. గిరిజనులు, ఆదివాసీలు, దళితులు ఎక్కువ నష్టపోతారని చెప్పారు.
సబ్‌కా బీమా సబ్‌కా రక్ష కాదు…సబ్‌కీ బీమా కరోడ్‌పతికా రక్ష అనే ఇన్సూరెన్స్ చట్టంలో మార్పులున్నాయనీ, విదేశీ సంస్థలకు ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని మోడీ సర్కారు కల్పించిందని రాఘవులు విమర్శించారు. శాంతి పేరుతో తీసుకొస్తున్న న్యూక్లియర్ లయబులిటీ బిల్లు విదేశీ సంస్థలు కంపెనీలు స్థాపించే అవకాశాన్ని కలిస్తుందనీ, ప్రమాదాలు జరిగితే కంపెనీల బాధ్యత కాదని ఆ చట్టంలో పేర్కొనటం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. పర్యావరణం దెబ్బతిన్నా…మనుషులు చచ్చినా సరేగానీ కార్పొరేట్ల లాభాలే ముఖ్యమన్నట్టు మోడీ సర్కారు వ్యవహరించడం తగదన్నారు. ప్రజల ముందు దేశభక్తి ఫోజులు కొడుతూ.. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల భక్తిని మోడీ సర్కారు చాటుతున్నదని విమర్శించారు. నిజమైన దేశభక్తులు ఎన్‌డీఏ, దాని మిత్రపక్షాలు కాదనీ, దేశ రక్షణ కోసం కొట్లాడుతున్న కమ్యూనిస్టులు, లౌకిశక్తులు, ప్రజలు నిజమైన దేశభక్తులని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తాము చేపట్టబోయే పోరాటాల్లో అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభమైందనీ, త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని గ్యానేశ్ కుమార్ ప్రకటించారనీ, సర్ పేరుతో బీజేపీకి మేలు చేసే నిర్ణయాలను ఈసీ తీసుకుంటున్నదని విమర్శించారు. బీజేపీ చేతుల్లో ఈసీ పావుగా మారిందని నొక్కి చెప్పారు. సర్‌పేరుతో పెద్ద ఎత్తున యాంటీ బీజేపీ ఓటర్ల ఓట్లను తొలగించే కుట్ర దీని వెనుక ఉందని తెలిపారు. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న అరావళి పర్వత శ్రేణుల్లో కార్పొరేట్ల హిల్ హౌజెస్‌లు పెరిగిపోతుండటమనేది పర్యావరణానికి, నీటి వనరులకు తీవ్ర నష్టమని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ…నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో వారంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఓఆర్‌ఆర్ అవతలకు పరిశ్రమలను తరలించి ఆ భూములను పారిశ్రామికవేత్తలకే అప్పగించాలని చూడటం సరిగాదన్నారు. ఆ పేరుతో రూ.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రూ.5వేల కోట్లకే పారిశ్రామిక వేత్తలకు కట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. ఆ భూములను ప్రజా ప్రయోజనాల కోసం, పేదలకు ఇండ్లను కట్టించడం కోసం ఉపయోగించాలని కోరారు. యూరియా యాప్‌ను ఎత్తేసి పాతపద్ధతిలోనే యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు. నగరం నడిబడ్డున ఉన్న కంటోన్మెంట్ బోర్డుకు వేరే ప్రాంతంలో భూములు అప్పగించి దాన్ని జీహెచ్‌సీంలో కలపాలని కోరారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) నేతను కిరాయి గుండాలతో హత్య చేయించిన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఒత్తిడితో విచారణలో పోలీసులు తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలనూ కలుపుకుని కేంద్రంపై పోరాటం చేయాలని కోరారు. గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. అభిప్రాయాలను వ్యక్తపరిస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ ఏదో ఒక చోట మోడీ, అమిత్‌షా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ఎన్‌ఐఏను నిలదీశారు. ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 90 శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని కేసీఆర్ చెప్పటం అవాస్తమన్నారు. అదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు కాంగ్రెస్ సర్కారూ నిధులను సరిగా కేటాయించడం లేదని ఎత్తిచూపారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులపై కాలయాపనలు, విమర్శలు మాని నిధులు కేటాయించి పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్‌లో ప్రమాదకర చట్టాలకు ఆమోదంలేబర్ కోడ్‌లతో ఉద్యోగ భద్రత కరువుపంపిణీ వ్యవస్థను ప్రయివేటుకప్పగించేందుకే విద్యుత్ సవరణ చట్టం’జీ రాం జీ’ చట్టంతో సామాజిక భద్రతకు తూట్లుఫోజులకే ప్రజల ముందు దేశభక్తి…నిర్ణయాల్లో కార్పొరేట్ల భక్తిశాంతి బిల్లు దేశానికి అత్యంత ప్రమాదకరంవాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలుమోడీ సర్కారు చేతిలో పావుగా ఈసీఐ
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ పాలకమండళ్లకు శుభాకాంక్షలుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులివ్వాలిపాతపద్ధతిలోనే యూరియా ఇవ్వాలిరామారావు హత్యకేసులో జాప్యం తగదు..హంతకులు వెంటనే శిక్షించాలిఅభిప్రాయాలను వ్యక్తపరిచేవారిపై ఎన్‌ఐఏ కేసులు సరిగాదు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


