నవతెలంగాణ-హైదరాబాద్ : కుటుంబ కలహాలతో వివాహిత తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. లేక్ పోలీసుల వివరాల ప్రకారం..పాతబస్తీలో నివాసముంటూ వ్యాపారం చేస్తున్న పృథ్విలాల్, చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కీర్తిక అగర్వాల్(28) దంపతులు. వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. దంపతుల మధ్య గొడవలతో ఆమె ఏడాదిన్నర కిందటే బహదూర్‌పురలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్ద కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈనెల 2న హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వివరాలు లభ్యం కాకపోవడంతో మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కీర్తిక అగర్వాల్‌గా గుర్తించిన ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమె తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావించి పరిశీలించగా మంగళవారం పాప మృతదేహాన్ని గుర్తించారు.



