అంతా నిశ్శబ్దం
అమ్మలాంటి ఆకుపచ్చ పల్లెటూరు
నిండా నిశ్శబ్దం
బండి పొలిమేరల దాకా వచ్చింది
దీపాల వేళ
ఏ ఇంటా దీపమే లేదు
ఊరంతా మనుషులే
గుంపులు గుంపులుగా
గుసగుసలు
ఎవరినోటా పలుకులేదు
అంతా నిశ్శబ్దమే
ఏమయిందో..!
గూటికి చేరే పక్షుల అరుపులు లేవు
పొలిమేర దాటిన బండి
మా యింటికే చేరుతోంది
పొద్దుగూకే వేళ
ఇంట దీపాలు లేవు
అమ్మ మర్చిపోయి ఉంటుంది
ఇల్లంతా కళ తప్పి కనిపిస్తోంది
పశువుల అలికిడి లేదు
అమ్మ అదిలింపులూ లేవు.
సాయం సంధ్యలో అమ్మ గిన్నెలు కడిగేటప్పుడు
వినవచ్చే గాజుల చప్పుడూ లేదు
తలుపు తట్టి లోపలికి పోయా
కాస్తాగు గడియ తీస్తానుండు అనే
పలుకు లేదు
నేను అల్లరి చేస్తూ అల్లారు ముద్దుగా
పెరిగిన ఆవరణలో అమ్మ
తలాపున దీపం వెలుగుతోంది
దిగులుగా, దు:ఖంగా
ఎవరో గొంతు విప్పారు
నీ కొడుకొచ్చాడు సీతమ్మా
లేచి చూడు… లేచి చూడు
అంటున్నారు…
- పి. సత్యం బాబు, ఖమ్మం