Monday, May 5, 2025
Homeప్రధాన వార్తలుపోరాడితేనే ప్రభుత్వంలో కదలిక

పోరాడితేనే ప్రభుత్వంలో కదలిక

- Advertisement -

– డిమాండ్ల సాధనకు ప్రత్యక్ష కార్యాచరణ
– తెలంగాణ ఎంప్లాయీస్‌, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌, టీచర్స్‌, వర్కర్స్‌, పెన్షనర్స్‌
– జేఏసీ కో చైర్మెన్‌ చావ రవి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డిమాండ్ల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్‌, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌, టీచర్స్‌, వర్కర్స్‌, పెన్షనర్స్‌ జేఏసీ కో చైర్మెన్‌ చావ రవి సూచించారు. ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ పోరాడితేనే కదలిక వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ మైనా, ఈ ప్రభుత్వమైనా, అది ఏ ప్రభుత్వమైనా సరే పోరాడితేనే స్పందిస్తుందని చెప్పారు. భౌతికంగా పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిగిలిన 8 జిల్లాల్లో త్వరితగతిన జేఏసీలు ఏర్పాటు చేయాలనీ, రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి సదస్సులు నిర్వహించాలని అన్నారు. జిల్లా సదస్సుల కోసం ఒక్కో జిల్లాలో ఒక్కో సంఘానికి అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వంతో జరిగిన చర్చల తర్వాత ఒక్క డీఏ ప్రకటించారనీ, సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నెల రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఆ సబ్‌ కమిటీ ఒక్కసారిగా కూడా ఉద్యోగుల ప్రతినిధులతో చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పీఆర్సీ ఏర్పాటు హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. అన్ని సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న జరగనున్న సార్వత్రిక సమ్మెకు కనీసం మద్దతు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర ఉద్యోగుల జేఏసీపై ఉందని ప్రతిపాదించా రు. చావ రవి ప్రతిపాదనతో సదస్సులో సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది.
సబ్‌ కమిటీ పిలవలేదు
సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? :మారం జగదీశ్వర్‌
ఉద్యోగుల సమస్యలపై వేసిన సబ్‌ కమిటీ ఇప్పటికీ తమను పిలవలేదనీ, తాము సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని మారం జగదీశ్వర్‌ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏలతో కలుపుకుని ఐదు డీఏలు పెండింగ్‌ ఉండగా, ఒక్క డీఏను మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులకు నెల మొదటి తారీఖున జీతాలు రావడం లేదని తెలిపారు. చెల్లించాల్సిన రూ.9,000 కోట్ల పెండింగ్‌ బిల్లులు అలాగే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి చెబుతున్నారనీ, అయితే ఎంతకాలం వేచి ఉండాలి? అని ప్రశ్నించారు. జీతభత్యాలకు నిధులు కేటాయించి కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నారని తెలిపారు. జూన్‌ 9న మహాధర్నాతో ప్రత్యక్ష పోరాటంలోకి వెళుతున్నట్టు హెచ్చరించారు. తాము సంక్షేమానికి వ్యతిరేకం కాదనీ, ఉద్యోగుల జీతభత్యాలు ఇచ్చాక సంక్షేమానికి ఇవ్వాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేయాలనీ, కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలనీ, ఈహెచ్‌ఎస్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలనీ, సీపీఎస్‌ రద్దు చేయాలనీ, వేతన సవరణ కమిటీని వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని తీర్మానించారు. స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులు సష్టించి 317 జీవో అమలు చేయాలనీ, పదోన్నతుల కమిటీలు ఏర్పాటు చేసి సకాలంలో పదోన్నతులు ఇవ్వాలనీ, ఎన్నికల వేళ బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి వారి పూర్వ స్థానాలకు చేర్చాలనీ, 2025 సంవత్సరానికి సాధారణ బదిలీలు మే, జూన్‌ నెలల్లో చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే 15న జిల్లా, రాష్ట్ర రాజధానిలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు, 9న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా, అంతకు ముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ర్యాలీ చేస్తామని సదస్సు హెచ్చరించింది. వీటితో పాటు పని వేళల్లో వర్క్‌ టు రూల్‌, మానవహారాలు-సామూహిక భోజనాలు (ప్రభుత్వ కార్యాలయాల ముందు), పెన్‌డౌన్‌, సామూహిక సెలవులు తదితర రూపాల్లో కార్యాచరణ ఉంటుందని తెలిపింది. ఈ సదస్సులో సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ పి.దామోదర్‌ రెడ్డి, డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ ఎ.సత్యనారాయణ, కో చైర్మెన్లు రవీందర్‌ రెడ్డి, జి.సదానందం గౌడ్‌, దాస్య నాయక్‌, తిరుపతి, మహిపాల్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, లింగారెడ్డి, వైస్‌ చైర్మెన్లు ఎస్‌ఏ.హుసేని (ముజీబ్‌), చంద్రమోహన్‌, అంజిరెడ్డి, శ్రీధర్‌, నరహరి, చంద్రశేఖర్‌ గౌడ్‌, సత్యనారాయణ రెడ్డి, తిప్పర్తి యాదయ్య, దామోదర్‌ రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -