– వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో మే డే వేడుకలు
నవతెలంగాణ – ముషీరాబాద్
కార్మిక, కర్షక చట్టాలను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని సాగనంపే వరకు వ్యవసాయ కార్మిక, రైతాంగ ఉద్యమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. మే డే సందర్భంగా గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొస్తానని మోడీ హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల అమలుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో కల్పించిన ప్రజాతంత్ర హక్కులను, చట్టాలను ఎత్తివేసే కుట్ర చేస్తోందన్నారు. కనీస వేతనాలు పెరగకపోవడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా గ్రామీణ సమ్మె జరుగుతుందని.. జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, బి.పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆంజనేయులు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, నాయకులు చంద్రరెడ్డి, అరి బండి ప్రసాద్ రావు, ఐఏఎస్ ఆకాడమీ ఎఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మోడీ ప్రభుత్వాన్ని సాగనంపే వరకూ ఉద్యమాలు
- Advertisement -
RELATED ARTICLES