నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా విరుచుకుపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బంగ్లాదేశ్ చొరబాట్లను ఆపలేకపోతే, ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్‌పై ఉంచాలని ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రకటన విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇలాగే ఆమె గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
దేశ సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదేనని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చొరబాట్లపై ప్రధాని మాట్లాడుతున్నప్పుడు, హోంమంత్రి మొదటి వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతున్నారు. లక్షలాది మంది భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూనే ఉన్నారు. మన భూమిని ఆక్రమించుకుంటున్నారని అన్నారు. దేశాన్ని రక్షించడంలో హోంమంత్రి విఫలమయ్యారని, కాబట్టి ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంచాలని మొయిత్రా తీవ్ర స్థాయిలో విమర్శించారు.