నవతెలంగాణ-హైదరాబాద్: స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్ పై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. రాజకీయ ప్రతీకారంతో సదురు ఎంపీని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నిట్ విద్యార్థి ఆత్మహత్య కేసులో బాధితుల పక్షాన పోరాడినందుకు ఎంపీ పప్పు యాదవ్‌ను అరెస్ట్ చేశారని ఆయన శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆరోపించారు.
బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ (MP Pappu Yadav)ను శనివారం తెల్లవారుజామున పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. 1995 నాటి ఫోర్జరీ కేసులో ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ అనివార్యమైంది. రాత్రి సుమారు 50 మంది పోలీసులు పప్పు యాదవ్‌ను అరెస్ట్ చేసేందుకు పాట్నాలోని మండిరి ప్రాంతంలో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మద్దతుదారులకు మధ్య తోపులాట జరిగింది. పార్లమెంట్ సమావేశాలు ముగించుకుని ఢిల్లీ నుంచి రాగానే తనను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పప్పు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.



