Friday, May 2, 2025
Homeఆటలుటాప్‌లేపిన ముంబయి

టాప్‌లేపిన ముంబయి

– 100 పరుగులతో రాజస్థాన్‌పై ఏకపక్ష విజయం
– ముంబయి 217/2, రాజస్థాన్‌ 117/10
ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన ముంబయి ఇండియన్స్‌.. సహజ శైలిలో పుంజుకుంది. వరుసగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. జైపూర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసిన ముంబయి ఇండియన్స్‌ సీజన్లో ఏడో విజయం నమోదు చేసింది. ఎనిమిదో పరాజయంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.
నవతెలంగాణ-జైపూర్‌

ముంబయి ఇండియన్స్‌కు ఎదురు లేదు. గురువారం జైపూర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ ఏకపక్ష విజయం సాధించింది. సీజన్లో ఏడో విజయంతో ముంబయి ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. ఎనిమిదవ పరాజయంతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ నిష్క్రమించింది. 218 పరుగుల భారీ ఛేదనలో రాయల్స్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (13), వైభవ్‌ సూర్యవంశీ (0) సహా నితీశ్‌ రానా (9), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (16), ధ్రువ్‌ జురెల్‌ (11), షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (0), శుభమ్‌ దూబె (15) విఫలమయ్యారు. ముంబయి పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌ (3/28), జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/15), దీపక్‌ చాహర్‌ (1/13) సహా స్పిన్నర్‌ కరణ్‌ శర్మ (3/23) వికెట్ల వేటలో రెచ్చిపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ (30, 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో ముంబయి విజయాన్ని కాస్త ఆలస్యం చేశాడు.
టాప్‌-4 మెరువగా.. :
తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. టాప్‌-4 బ్యాటర్లు దుమ్మురేపటంతో ముంబయి ఇండియన్స్‌ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. ఓపెనర్లు రియాన్‌ రికెల్టన్‌ (61, 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (53, 36 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిశారు. తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించిన ఓపెనర్లు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. రోహిత్‌ శర్మకు ఆరంభంలోనే డిఆర్‌ఎస్‌ రివ్యూతో ఔటయ్యే ప్రమాదం తప్పింది. పవర్‌ప్లేలో 58/0 పరుగులు చేసిన ఓపెనర్లు.. ఫీల్డింగ్‌ సెటప్‌ మారినా దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో రియాన్‌ రికెల్టన్‌ 29 బంతుల్లోనే సీజన్లో మూడో అర్థ సెంచరీ కొట్టాడు. రోహిత్‌ శర్మ సైతం సీజన్లో మూడో ఫిఫ్టీ అందుకున్నాడు. తొమ్మిది బౌండరీలు బాదిన రోహిత్‌ 31 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. ఓపెనర్లు ఇద్దరూన స్వల్ప విరామంలో వికెట్‌ కోల్పోయినా.. ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ వేగం తగ్గలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ (48 నాటౌట్‌, 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (48 నాటౌట్‌, 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌కు అజేయంగా 94 పరుగులు జోడించారు. హార్దిక్‌ ఆరు ఫోర్లు బాదగా.. సూర్య మూడు సిక్సర్లతో చెలరేగాడు. ముంబయి బ్యాటర్లను నిలువరించటంలో రాయల్స్‌ బౌలర్లు విఫలమయ్యారు. మహీశ్‌ తీక్షణ (1/47), రియాన్‌ పరాగ్‌ (1/12) తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. జోఫ్రా ఆర్చర్‌, ఫజల్‌ ఫరూకీ, కుమార్‌ కార్తికేయ, ఆకాశ్‌ మద్వాల్‌ నిరాశపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img