Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునల్లగొండ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన మూసీ.. రాకపోకల బంద్

నల్లగొండ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన మూసీ.. రాకపోకల బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లాలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు ఏడు గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 3, 4, 5, 6, 8, 10, 12 నంబర్ల క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తి, 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నీటి విడుదలతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని, పశువులను కూడా నది వైపు తీసుకెళ్లవద్దని సూచించారు.

మరోవైపు మూసీ ఉద్ధృతి కారణంగా పలుచోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జూలూరు-రుద్రవెల్లి వద్ద ఉన్న లో-లెవల్ బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోచంపల్లి-బీబీనగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీబీనగర్, భువనగిరి వెళ్లాల్సిన వాహనదారులు పెద్ద రావులపల్లి మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణిస్తున్నారు.

అధికారులు ముందుజాగ్రత్త చర్యగా బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, మూసీ నది సమీప ప్రాంతాల్లో సంచరించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -