నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు వారాలకు పైగా పశ్చిమాసియాలో యుద్ధం రగులుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ మూకమ్మడిగా ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా వారి దాడులను ప్రతిఘటిస్తునే ప్రతిదాడులను తీవ్రతరం చేసింది. ఈక్రమంలోనే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో రోజులతరబడి సాగుతున్న యుద్ధంతో ఇంధన సంక్షోభం నెలకొంది. ఆ మార్గం గుండా చమురు నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హర్మూజ్‌ను తెరవాలని ట్రంప్ గగ్గోలు పెడుతున్నాడు. ఆ జలసంధి తెరవకుంటే..ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్, పరిశ్రమలపై దాడులు చేసి సర్వనాశనం చేస్తామని బీరాలు పలుకుతున్నారు. ఈనేపథ్యంలోనే ఇరాన్‌లో ప్రముఖ సంగీతకారుడు అలీ ఘస్మారి దమావంద్ పవర్ ప్లాంట్ ముఖద్వారం ఎదురు కూర్చొని తార్‌ను వాయించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు.
“నా ప్రియ మిత్రులారా, నమస్కారం. నేను ప్రస్తుతం దమావంద్ పవర్ ప్లాంట్ వద్ద ఉన్నాను. ఈ ప్రదేశంపై దాడి జరుగుతుందని బెదిరింపులు వచ్చాయి, కానీ ఆ దాడి జరగదని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో ఇక్కడ ఉంటే బాగుండేదని నేను మాటల్లో చెప్పలేను. నా తార్ వాద్యం యొక్క శబ్దం శాంతిపై ప్రభావం చూపుతుందని, ఇళ్లలో దీపాలు ఆరిపోకుండా కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను,” అని ఘమ్సారీ ఆ వీడియోలో అన్నారు.
ఘమ్సారీ ఒక సుప్రసిద్ధ ఇరానియన్ సంగీతకారుడు. స్వరకర్త. ఆయన తార్ వాద్యంపై పర్షియన్ శాస్త్రీయ సంగీతాన్ని వాయించడంలో పేరుప్రఖ్యాతలు పొందారు. తాజాగా ఆయన దమావంద్ ప్లాంట్ ఎదుట సాంప్రదాయ చాపపై కూర్చుని, పర్షియన్ శాస్త్రీయ సంగీతంలో కీలకమైన తార్‌ను వాయిస్తూ శాంతికి పిలుపునిచ్చారు.



