- మధ్యప్రదేశ్ మార్కెట్‌లో రైతు ఆవేదన
నవతెలంగాణ-హైదరాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్‌లో అమ్మడానికి అపసోపాలు పడుతుంటారు రైతులు. ఎండలకు, వానాలకు, చీడపీడల నుంచి రక్షించి పండించిన పంటలకు సరైనా మద్దతు ధర లభించదు. ఒకవేళ లభించినా నాణ్యత పేరుతో అనేక కొర్రీలు పెట్టి..రైతుల కష్టాన్ని నిలువునా దోచ్చేయడానికి దోపిడీలు దారులు గుంటనక్కల వేచి చూస్తుంటారు.
మధ్యప్రదేశ్‌లోని గుణ వ్యవసాయ మార్కెట్‌లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. తన కూతురి పెళ్లి కోసం డబ్బు సంపాదించడానికి పంటను అమ్మేందుకు వచ్చిన రైతు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గంటల తరబడి మార్కెట్‌లో నిస్సహాయంగా వేచి ఉండాల్సి వచ్చింది. శ్రీపుర్చక్ గ్రామానికి చెందిన రైతు తన కొత్తిమీర, ఆవాలు పంటను అమ్మేందుకు ఉదయం నుంచే మార్కెట్‌కు వచ్చాడు. కానీ వేలం ప్రక్రియలో జరిగిన వివాదం కారణంగా వందలాది మంది రైతులతో పాటు అతను కూడా చిక్కుకుపోయాడు.
మార్కెట్ ఇన్‌స్పెక్టర్ మద్యం మత్తులో ఉండి వేలం ధరను తక్కువగా నమోదు చేయడం వల్ల సమస్య ప్రారంభమైంది. పంటకు క్వింటాలుకు రూ.5,700 ధర నిర్ణయించినప్పటికీ స్లిప్‌లో రూ.5,400 మాత్రమే నమోదు చేయడంతో రైతులు దీనిని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో వ్యాపారులు వేలాన్ని బహిష్కరించగా వేలం పూర్తిగా నిలిచిపోయింది.
దీనితో ఉదయం నుంచే పంట అమ్మడానికి వచ్చిన వందలాది మంది రైతులు మార్కెట్‌లోనే నిలిచిపోయారు. “రేపు నా కూతురి పెళ్లి ఉంది… దయచేసి నా పంట కొనండి” అంటూ రైతు చేతులు జోడించి అధికారులను వేడుకున్నప్పటికీ స్పందన లేకపోయిందని అక్కడి రైతులు తెలిపారు.
చివరికి రైతుల నిరసనల నేపథ్యంలో సంబంధిత మార్కెట్ ఇన్‌స్పెక్టర్‌ను పదవి నుంచి తొలగించారు. ఘటనపై అధికారిక దర్యాప్తు కూడా ప్రకటించారు. ఈ సంఘటన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వ్యవసాయ మార్కెట్లలో ఉన్న లోపాలను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చిందని స్థానికులు అంటున్నారు.



