నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాలిక హత్యకేసు పోలీసులు ఛేదించారు. ఐదు రోజులుగా ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తులో బాలికను హత్య చేసిన నిందితుని పోలీసులు గుర్తించారు. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా ఆ ఇంటి పరిసరా ప్రాంతాల్లో వందకు పైగా సీపీ పుటేజీలను పోలీసులు జల్లెడ పట్టారు. అంతేకాకుండా పలు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఎట్టకేలకు మృతురాలు సహస్ర ఇంటికి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న పదవ తరగతి విద్యార్థి ఈ హత్యకు కారణమని తేలింది. అతడు దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి వెళ్లగా, ఆ సమయంలో బాలికను చూసి భయపడి ఆమెను హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సహస్ర హత్య వెనుక ఉన్న నిజం వెలుగులోకి రావడంతో, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో కూకట్‌పల్లి ప్రాంతం తీవ్ర కలకలం రేపింది. చిన్నారి హత్యకు కారణమైన నిందితుడు ఒక స్కూల్ విద్యార్థి కావడం స్థానికులను మరింత షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.