నవతెలంగాణ – హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీహార్ లో ఓటర్ జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టిపెట్టింది. అక్రమంగా ఓటు హక్కు పొందిన వారి పేర్లను తొలగించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (సర్)ను చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ వ్యతిరేకులు, ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకే ఈ సర్వే చేపట్టిందంటూ రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఓటర్ జాబితాలో పెద్దమొత్తంలో అనర్హుల పేర్లు చేరాయని ఈసీ వాదిస్తోంది. పొరుగు దేశాలకు చెందిన వ్యక్తులు కూడా బీహార్ లో అక్రమంగా ఓటు హక్కు పొందారని ఆరోపించింది.
ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. మన దేశానికి పొరుగున ఉన్న నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ లతో పాటు ఆఫ్ఘనిస్థాన్ వాసులు పలువురు ఓటు హక్కు పొందారని తేలినట్లు వెల్లడించింది. అనర్హులుగా గుర్తించిన సుమారు 3 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపినట్లు తెలిపింది. వారి గుర్తింపు పత్రాలను పరిశీలించిన తర్వాత అర్హుల పేర్లను కొనసాగిస్తూ అనర్హుల పేర్లను తొలగిస్తామని, సవరించిన ఓటర్ జాబితాను సెప్టెంబర్ 30న విడుదల చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.