నవతెలంగాణ-హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీలపై ఇడి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జిషీటును మంగళవారం ఢిల్లీ కోర్టు స్వీకరించడానికి నిరాకరించింది. ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని తమ పదవులకు రాజీనామా చేయాలని బుధవారం ఆయన డిమాండ్ చేశారు. నేడు ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ‘గాంధీ కుటుంబాన్ని వేధించడమే నేషనల్ హెరాల్డ్ కేసు లక్ష్యం. కేవలం రాజకీయ ప్రతీకార దృక్పథంతోనే దీనిని దాఖలు చేశారు. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం నరేంద్ర మోడీ, అమిత్ షాలకు చెంపదెబ్బలాంటిది. భవిష్యత్తులో ప్రజలను వేధించబోమని పేర్కొంటూ వారు రాజీనామా చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే నేషనల్ హెరాల్డ్ కేసు ఓ తప్పుడు కేసుగా ఖర్గే అభివర్ణించారు. కేవలం రాజకీయ ప్రతీకారం, దురుద్దేశంతోనే ఈ కేసును కొనసాగించారని ఆయన ఆరోపించారు. 1938లో స్వాతంత్య్ర సమరయోధులు ఈ (నేషనల్ హెరాల్డ్) పత్రికను ప్రారంభించారు. దీనిని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు మనీలాండరింగ్ వంటి విషయాలతో ముడిపెట్టి అప్రతిష్టపాల్జేందుకు ప్రయత్నిస్తోంది. నిజం ఏమిటంటే ఈ కేసులో ఏమీ లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడమే బీజేపీ ఈ కేసును ఒక సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తోంది అని ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి ఇడి ద్వారా కేసుల్ని పెట్టిస్తుంది. కానీ ఢిల్లీ కోర్టు తీసుకున్న నిర్ణయంతో ‘తీర్పు న్యాయానికి అనుకూలంగా వచ్చింది. సత్యం గెలిచింది. కోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ఖర్గే అన్నారు.



