– అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల వెల్లడి
– ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : రాజ్‌నాథ్ సింగ్
– రెండోసారీ ప్రధాని మోడీ డుమ్మా…సర్వత్రా విమర్శలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ భద్రత విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యతను ప్రదర్శించాయి. ఉగ్రవాద స్థావరాలపై భద్రతా దళాలకు చేసిన దాడికి రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. అలాగే భవిష్యత్తులో కూడా ఉగ్రవాదులను అణచివేసేందుకు భద్రతా దళాలు తీసుకున్న చర్యలకు మద్దతుగా ఉంటామని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. గురువారం నాడిక్కడ పార్లమెంట్లోని ల్రైబరీ భవన్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ విపక్షాలకు వివరించారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించామని, వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. అయితే ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం తమకు లేదని, కానీ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఈ దాడులు చేశామని, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్రం తరపున మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, జెపి నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ (కాంగ్రెస్), సందీప్ బందోపాధ్యాయ (టీఎంసీ), టిఆర్ బాలు (డీఎంకే), జాన్ బ్రిట్టాస్ (సీపీఐ(ఎం), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్‌పీ), సంజరు సింగ్ (ఆప్), సుప్రియా సూలే (ఎన్‌సీపీ), సంజరు రౌత్ (శివసేన, ఠాక్రే), మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), సస్మిత్ పాత్ర (బీజేడీ), లావు శ్రీక ృష్ణదేవరాయులు (టీడీపీ), వైవి సుబ్బారెడ్డి (వైసీపీ), శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే (శివసేన (షిండే)), ప్రఫుల్ పటేల్ (ఎన్‌సీపీ), కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (ఆర్‌ఎల్‌ఎస్‌పి) తదితరులు పాల్గొన్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తరువాత ఇది రెండో అఖిలపక్ష సమావేశం. రెండు సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరు అయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమావేశానికి ప్రధాని మోడీ గైర్హాజరు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్షాలు పరిణితితో
వ్యవహరించాయ్ణి కిరణ్ రిజిజు
ఈ క్లిష్టమైన సమయంలో ప్రతిపక్షాలు అత్యంత పరిణితితో వ్యవహరించాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో సమస్య తీవ్రత ద ృష్ట్యా చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఐక్యంగా నిలబడ్డాయన్నారు. ప్రతి నాయకులు అందరూ ఒకే గొంతెతో మాట్లాడారని, బాధ్యత, పరిణితితో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీలకు అతీతంగా, రాజకీయ నాయకులు ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో రాజకీయాలకు చోటు లేదని అన్నారని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై అన్ని నాయకులు ఏకగ్రీవంగా సాయుధ దళాలను అభినందించారని తెలిపారు. ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సమావేశంలో అనేక విలువైన సూచనలు కూడా ముందుకు వచ్చాయని అన్నారు. విస్త ృత రాజకీయ ఏకాభిప్రాయం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. జాతీయ భద్రత, దేశ ప్రజల భద్రత, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల భద్రతపై రాజకీయ పార్టీల నేతలు తమ ఆందోళనలను తెలిపారని పేర్కొన్నారు.
ఐక్యంగా నిలబడుత్ణాం రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలుస్తాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశం కోసం ప్రభుత్వానికి, భద్రతా దళాలు తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించామని అన్నారు. మంచి సందేశం ఇవ్వడానినికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడం పట్ల నిరాశ చెందానని రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గే అన్నారు. ప్రధాని మోడీ పాల్గొని ఉగ్రవాదంపై చర్యల గురించి క్లుప్తంగా మాట్లాడాలని తాము కోరుకున్నామని, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారని అనుకున్నామని, కానీ ఆయన సమావేశానికి హాజరుకాలేదని అన్నారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు తాము సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందుకు సాగాలని, కేంద్రం తీసుకునే నిర్ణయాలలో తాము ప్రభుత్వంతో ఉంటామని, సైన్యంతో నిలబడతామని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రత అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు లేవనెత్తాయని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేస్తే ఎంపిలు తమ అభిప్రాయాలను ముందుకు తెచ్చి ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవచ్చని ఖర్గే అన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిపారు.
డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ అన్ని పార్టీలు ప్రభుత్వంతో కలిసి నిలబడతాయని ఏకగ్రీవంగా చెప్పామని అన్నారు. ఇది కీలకమైన పరిస్థితి కాబట్టి ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశాలకు హాజరు కావాలని మేమందరం తమ అభిప్రాయాలను వ్యక్తం చేసామని వివరించారు. శివసేన ఎంపీ సంజరు రౌత్ మాట్లాడుతూ ఈ సంక్షోభ సమయంలో అందరం ఐక్యంగా ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని తాను ప్రభుత్వానికి సలహా ఇచ్చానని అసదుద్దీన్ అన్నారు. అంతేగాక టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని అమెరికాను కోరాలని కూడా తాను కేంద్రానికి సూచించానని చెప్పారు. అదే విధంగా పాకిస్థాన్‌ను ‘ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)’ లో గ్రే లిస్టులో పెట్టేలా ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. దాంతో అంతర్జాతీయంగా పాకిస్థాన్ కు నిధులు రాక కష్టమవుతుందని తెలిపారు.
దేశ భద్రతే కీలకం
- Advertisement -
- Advertisement -