– ఇరిగేషన్ ఈఎన్సీ హరిరాంపై ఏసీబీ కేసు
– కాళేశ్వరానికి ప్రజాధనం వృధా
– కమిషన్ల నివేదికలే సాక్ష్యం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కుంగుబాటుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదిక ఎఫెక్ట్ ప్రారంభమైంది. గతంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికన చర్యలు తీసుకున్న సర్కారు, ఇప్పుడు ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా పావులు కదుపుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా పనిచేసిన హరిరాంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పేరుతో శనివారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. నీటిపారుదల శాఖ రాష్ట్ర కార్యాలయం జలసౌధ నుంచి అవసరమైన సమాచారం తీసుకున్న ఏసీబీ కొరడా ఝులిపించింది.
పక్కా సమాచారంతోనే
హైదరాబాద్‌లోని హరిరాం నివాసంతోపాటు ఆయన పనిచేసిన, ప్రస్తుతం చేస్తున్న కార్యాలయాలు, ఆయన భార్య అనిత పనిచేస్తున్న రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వాలంతరి కార్యాలయం నుంచి సమాచారం సేకరించినట్టు తెలిసింది. హరిరాం భారీగా ఆస్తులు కూడబెట్టారనేది ఏసీబీ ప్రధాన విమర్శ. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో సోదాలు జరుగుతున్నాయి. శనివారం అర్థరాత్రి వరకూ కొనసాగాయి. అదంతా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సంపాదించిందేనని ఏసీబీ భావిస్తున్నది. ఆ మేరకు కొందరు ఫిర్యాదు సైతం చేసినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో ఏకంగా పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. సోదాలకు ముందే సమగ్ర సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఇదిలావుండగా ఎన్డీఎస్‌ఏ నివేదిక కాళేశ్వరం భవిష్యత్‌ను తేల్చేసిందనే వ్యాఖ్యానాల పట్ల మాజీ ఇరిగేషన్ ఇంజినీర్లు, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాజెక్టు పనికిరాదు
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలోకి రాదని ప్రభుత్వం వేసిన మూడు కమిషన్లు సూచిస్తున్నాయి. విజిలెన్స్ కమిషన్ గత మార్చి 22న నివేదిక ఇస్తూ 17 మంది ఇంజినీర్లపై కేసులు పెట్టాలనీ, అలాగే మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారించిన విజిలెన్స్ కమిషన్, మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత సీఈ సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నివేదికపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే ఇటీవల ఎన్‌డీఎస్‌ఏ సంస్థ, 378 పేజీల తుది రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. కాళేశ్వరం మూడు బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకూడదని నివేదికలో హెచ్చరించింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడవ బ్లాక్‌ను పూర్తిగా తొలగించాలనీ, దీంతో ఇతర బ్యారేజీలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఏడవ బ్లాకులో మాదిరిగా మిగతా బ్లాకుల్లో జరగవనే గ్యారంటీ లేదని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇంత ప్రమాదం జరిగినా బీఆర్‌ఎస్ మాత్రం చిన్న సమస్యను పెద్దది చేస్తున్నారనే ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. చివరికి జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ కూడా నిర్మాణాలపై విచారణ సందర్భంగా అసంతృప్తి వెలిబుచ్చుతున్నది.
బ్యారేజీలకే రూ. 20 వేల కోట్లు
ప్రాజెక్టులో పెట్టిన రూ.1.05 లక్షల కోట్లల్లో రూ. 20 వేల కోట్లు ఈ మూడు బ్యారేజీలకే ఖర్చుపెట్టారు. ఈ మూడింటినీ వదిలేయడం మంచిదని విచారణ సంస్థలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణ మూలంగా ఎకరానికి రూ. 40 వేల ఖర్చును ప్రభుత్వం భరించాల్సి వస్తుందని గతంలోనే ‘కాగ్’ నివేదిక సైతం చెప్పిన విషయమూ విదితమే. ఈ మూడు డ్యామ్‌లను వదిలేసి ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి 110 కిలోమీటర్లల్లో 70 కిలోమీటర్ల మేర ఇప్పటికే కాలువ తవ్వారు. ఆదిలాబాద్ జిల్లా మైలారం వద్ద 20 మీటర్ల ఎత్తు లిఫ్ట్ పెట్టడం ద్వారా ప్రాణహిత-ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తవుతుంది.
దీని నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 8000 ఖర్చు చేస్తే సరిపోతుందని సమాచారం. ప్రాణహిత నీరే మేడిగడ్డకు రావడం మూలాన నీటి లభ్యతలో 10 నుంచి 12 టీఎంసీలు మినహా పెద్దగా నష్టం జరగదని నీటిపారుదల నిపుణులు సైతం అభిప్రాయపడున్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదిక సైతం అదే చెప్పింది. ప్రాణహిత వద్ద నీరు సముద్ర మట్టానికి 148 మీటర్లు ఎత్తులో ఉండగా, ఎల్లంపల్లి దగ్గర కూడా 148 మీటర్లేనని నివేదిక స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో మైలారం దగ్గర 20 మీటర్ల లిఫ్ట్ ఏర్పాటు చేస్తే సరిపోతుందని కేంద్ర నీటిపారుదల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ గతంలోనే చెప్పారు. మరో 15 రోజుల్లో గోదావరికి వరద రావడం, ఆ వరదలకు మరింత నష్టం జరిగే అవకాశం ఉన్నదని విచారణ కమిషన్లు సైతం చెబుతున్నాయి.
నిపుణుల సూచన మేరకే
సాంకేతికంగా సీడబ్ల్యూసీతో సహా అన్ని సాగునీటి సంస్థలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ సాధ్యం కాదంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. అన్నారానికి పెద్ద బుంగ పడి నీరంతా బ్యారేజీ వెనుకకు వస్తున్నది. ఆ బుంగ పెరగడంతో బ్యారేజీ కుంగుబాటుకు అవకాశం ఉంది. సాగునీటిపారుదల నిపుణులు ఇచ్చిన సలహాలేగాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిషన్ ఎన్డీఎస్‌ఏ, జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్లు ప్రాజెక్టును ఉపయోగించకూడదని చెబుతున్నాయి. వీటిని వదిలేయడం మూలాన ప్రభుత్వానికి రూ.17000 కోట్ల నష్టం మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. మూడు బ్యారేజీల మోటారు పంపులను మరోచోట వినియోగించుకునే అవకాశముంది. వందల ఏండ్లుగా గోదావరికి వరదలు రావడంతో, నదిలో అసలు నెలపై వందలాది అడుగుల మేర ఇసుక పేరుకుపోయింది. గోదావరికి అడ్డంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టరాదని అనేకమంది సలహాలు ఇచ్చారు. కాకతీయ కాలంలో నిర్మించిన పాకాల, రామప్ప, లక్నవరం నదులకు ఎదురుకాకుండా పక్కన కట్టడంతో నీటికి పూడిక రాలేదు. గోదావరికి వస్తున్న పూడికలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటివిలువ 120 టీఎంసీల నుంచి 85 టీఎంసీలకు తగ్గింది. ఈ వాస్తవాల ఆధారంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎన్డీఎస్ఏ ఎఫెక్ట్
- Advertisement -
RELATED ARTICLES