నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపే సమయంలో భారత్ మరింత జాగరూకతతో, తెలివిగా వ్యవహరించాల్సి వుందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయరంగానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక వృద్ధి 6-7శాతం పరిధిలోనే స్థిరపడిందని, ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల వల్ల కొంత శాతం ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయం వంటి కీలక రంగంలో వాణిజ్య చర్చలు చాలాకష్టమని తాను భావిస్తున్నానని అన్నారు.
ప్రతి దేశం వ్యవసాయదారులకు అధిక మొత్తంలో సబ్సిడీ ఇస్తుందని, కానీ మన దేశంలో వ్యవసాయదారులు తక్కువగా ఉండవచ్చు, సబ్సిడీలు తక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో దేశంలోకి అపరిమితంగా వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతైతే సమస్యలు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వారం ప్రారంభంలో వాషింగ్టన్‌లో భారత బృందం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ) కోసం ఐదవ రౌండ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. భారతదేశంతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అమెరికా ఇండోనేషియాతో ఖరారు చేసిన విధంగానే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ఇది భారత్‌కు ఇబ్బంది కరంగా మారవచ్చు. ఇతర దేశాల నుండి మన దేశంలోకి పాల ఉత్పత్తులను స్వాగతిస్తున్నామని చెప్పడం కంటే మనం చేయగలిగింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. వీటన్నింటి దృష్ట్యా భారత్ చాలా జాగ్రత్తగా, తెలివిగా చర్చలు జరపడం అవసరమని అన్నారు. ఈ విషయంలో మన దౌత్యవేత్తలు దానిలోనే నిమగమై ఉంటారని ఆశిస్తున్నానని అన్నారు.
వాణిజ్య అనిశ్చితులు ఎగుమతులు, పెట్టుబడులు రెండింటికీ ప్రతికూలంగా ఉన్నాయని అన్నారు. కానీ అమెరికా వంటి కొన్ని ఇతర దేశాలకు భారతదేశం ప్రత్యామ్నాయ మార్గంగా భావించేంత వరకు వాటిలో అవకాశాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలని సూచించారు.