Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంఆగస్టు 3న నీట్‌ పీజీ-2025 పరీక్ష

ఆగస్టు 3న నీట్‌ పీజీ-2025 పరీక్ష

- Advertisement -

– నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి
న్యూఢిల్లీ:
నీట్‌ పీజీ-2025 పరీక్షను ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నిర్వహించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. ఈ మేరకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈ) చేసిన అభ్యర్థనకు భారత సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పికె మిశ్రా, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిV్‌ాలతో కూడిన ధర్మాసనం ముందు ఎన్‌బీఈ ఈ అభ్యర్థనను చేసింది. ఈ ఏడాది మే 30న ఇచ్చిన తీర్పులో నీట్‌ పీజీని రెండు షిప్టుల్లో కాకుండా ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నీట్‌ పీజీ-2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలనీ, పారదర్శకత కొనసాగే విధంగా సురక్షితమైన కేంద్రాలను గుర్తించాలని మే 30న ఇచ్చిన ఉత్తర్వులో ఎన్‌బీఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు షిఫ్టుల్లో నీట్‌ పీజీ పరీక్షను నిర్వహించడం వల్ల అసమాన పరిస్థితులు ఏర్పడతాయని, ప్రశ్నాపత్రాలు ఒకే ప్రమాణాలతో, కఠినంగా ఉండకపోవచ్చని కొంత మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించి సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే, ఎన్‌బీఈ వసూలు చేసిన పరీక్ష ఫీజును కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతి జనరల్‌ కేటగిరీ అభ్యర్థి నుంచి రూ. 3,500, ఎస్సీ, ఎస్టీ వికలాంగ అభ్యర్థుల నుంచి రూ. 2,500 వసూలు చేయడాన్ని ప్రస్తావించింది. ఇంత భారీ ఫీజులు వసూలు చేశారు కాబట్టి, ఒకే షిఫ్ట్‌లో పరీక్షను సజావుగా నిర్వహించడానికి, తగిన సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఎన్‌బీఈ వద్ద తగినంత నిధులు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దీంతో ఒకే షిఫ్టులో పరీక్షను నిర్వహించడానికి ఎన్‌బీఈ అదనపు సమయం కోరింది. తాజాగా ఆగస్టు 3ను ప్రతిపాదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -