నవతెలంగాణ-హైదరాబాద్ : వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్-యూజీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు, బీవీఎస్‌సి, ఏహెచ్, బీహెచ్‌ఎంఎస్‌తోపాటు బీఎస్సీ నర్సింగ్ (ఎమ్మెన్నెస్) వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
నేటి నుంచి నీట్ రిజిస్ట్రేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తమ సైట్ neet.nta.nic.in లో ప్రారంభించింది. నెల రోజులపాటు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే వచ్చే మార్చి 8, రాత్రి 9 గంటలవరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫీజు చెల్లించేందుకు అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంది. అప్లికేషన్లలో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మార్చి 10-12 వరకు అవకాశం ఉంది. మే 3న, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
మూడు గంటలపాటు జరిగే ఈ పరీక్షను పెన్నుతో రాయాల్సి ఉంటుంది. 13 భాషల్లో కావాల్సిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. విదేశాల్లోనూ పరీక్ష జరుగుతుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.



