– మధ్యప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగల్
భోపాల్: దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో నీట్-యూజీ ఫలితాలను వెల్లడించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఈ ఫలితాల వెల్లడిపై తాత్కాలికంగా స్టే విధిస్తూ ఈ నెల 15న జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు సవరించింది. విద్యార్ధులు విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొన్న ఇండోర్‌లో 11 కేంద్రాల్లో మాత్రం ఫలితాలు వెల్లడించరాదని పేర్కొంది. విద్యుత్ అంతరాయం వల్ల ఇబ్బంది పడిన కేంద్రాల వివరాలను రెండు రోజుల్లోగా అందచేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి హామీ ఇవ్వడంతో శుక్రవారం జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ ఈ ఆదేశాలను సవరించారు. వైద్య విద్యనభ్యసించాలని భావిస్తున్న విద్యార్ధిని ఒకరు ఈ నెల 15న వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అభ్యంకర్ దేశవ్యాప్తంగా ఫలితాల వెల్లడిపై తాత్కాలికంగా స్టే విధించారు. మే 4న జరిగిన ఎంట్రన్స్ పరీక్ష సందర్భంగా సదరు విద్యార్ధినికి సరైన వసతులు అందించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంది. వాతావరణం అననుకూలంగా వుండడంతో మే 4వ తేదీన ఇండోర్‌లో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో ఆ విద్యార్ధిని హైకోర్టును ఆశ్రయించింది. తాను పరీక్ష రాసే కేంద్రంలో రెండు గంటల పాటు విద్యుత్‌లేకపోవడంతో తాను సరిగా పరీక్ష రాయలేకపోయానని ఆమె పేర్కొంది. ఇండోర్‌లో మొత్తంగా 11 కేంద్రాల్లో ఈ పరిస్థితి నెలకొందని మెహతా చెప్పారు. దాంతో ఇతర కేంద్రాల్లో ఫలితాలను వెల్లడించేందుకు ఎన్‌టిఎను అనుమతిం చాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో 15వ తేదీ తీర్పును సవరిస్తూ నీట్ ఫలితాల వెల్లడికి న్యాయస్థానం పచ్చజెండా ఊపింది.
నీట్-యూజీ ఫలితాలను వెల్లడించవచ్చు
- Advertisement -
- Advertisement -