– శిథిలావస్థలో 32 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు
– వాడుకలోకి తెస్తే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొచ్చు
– రూ.600 కోట్లు కేటాయించి ఏం చేశారు? : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– నేరుగా సొసైటీలకే నిధులు కేటాయించాలి
– ధ్వంసం చేసిన ఇబ్రహీంపట్నం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలన
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
మత్స్య శాఖలోని కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే రాష్ట్రంలోని 32 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఫలితంగా ఇతర రాష్ట్రాల్లో నుంచి చేప పిల్లలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను వాడుకలోకి తెస్తే తెలంగాణలోని చెరువులు, కుంటలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ధ్వంసం చేసిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శేరిగూడలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పార్టీ జిల్లా నాయకులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. అక్కడి మత్స్యకార సంఘాల నాయకులతో చర్చించారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, భూ విస్తీర్ణం, చేప పిల్లల మార్కెట్ నిర్మాణం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 60 ఏండ్ల క్రితం నిర్మాణం చేపట్టిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నిర్లక్ష్యానికి గురైందని మత్స్యకారులు జాన్‌వెస్లీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వమే చేపల ఉత్పత్తిని నిలిపి వేసిందన్నారు. చేపల మార్కెట్ నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. ఆ కేంద్రాన్ని ధ్వంసం చేయకుండా పక్క స్థలంలో నిర్మాణం చేపట్టాలని తాము చెప్పినా వినకుండా ధ్వంసం చేశారని వివరించారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపల ఉత్పత్తికి 32 కేంద్రాల నిర్మాణం చేపట్టారని అన్నారు. కాలక్రమేణా ఉత్పత్తి కేంద్రాలకు నిధులు కేటాయించకుండా, సిబ్బందిని నియమించకుండా నిర్లక్ష్యానికి గురిచేశారని తెలిపారు. రాష్ట్రంలో 6000 మత్స్యకార సొసైటీలు, సహకార సంఘాలు ఉన్నాయని, ఈ సంఘాల పరిధిలో సుమారు ఆరు లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని చెప్పారు. ఒక్కో చేపల ఉత్పత్తి కేంద్రం సుమారు 100 చెరువులు, కుంటలకు చేప పిల్లలను ఎగుమతి చేసే స్థాయి కలిగి ఉందన్నారు. వాటిని వాడుకోకుండా కాకినాడ, భీమవరం ప్రాంతాల నుంచి చేప పిల్లలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రూ.600 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా సింహభాగం నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకే వెళుతున్నాయని అన్నారు. మత్స్య కార్మికులు రూ.30 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని అకారణంగా ధ్వంసం చేయడం సరికాదని, వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను వాడుకలోకి తేవాలని డిమాండ్ చేస్తూ పార్టీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టర్లను కలిసి వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తామని, అలాగే నేరుగా సీఎంను కలిసి విన్నవిస్తామని తెలిపారు. మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గొరెంకల నర్సింహ, లెల్లెల బాలకృష్ణ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, కందుకూరి జగన్, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సిహెచ్ బుగ్గరాములు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ జంగయ్య, సంఘం జిల్లా అధ్యక్షులు చెనమోని శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలు ఇస్తారి, సీఐటీయూ జిల్లా నాయకులు పోచమోని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే..చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలపై నిర్లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES