– వెంటనే కొనుగోలు చేయాలి
– రాష్ట్రీయ రహదారిపై రైతుల ఆందోళన
– ఖమ్మంలో రోడ్డెక్కిన అన్నదాతలు..రోడ్డుకడ్డంగా ట్రాక్టర్లు పెట్టి నిరసన
నవతెలంగాణ-తల్లాడ
ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం- రాజమండ్రి రాష్ట్రీయ రహదారిపై బుధవారం రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను కాపాడాలని, తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని, అధికారులు సంఘటనా స్థలానికి రావాలని నినాదాలు చేశారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నాయకులను, రైతులను ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు. ఒక దశలో తోపులాట జరిగింది. రాస్తారోకో విరమించే ప్రసక్తేలేదని, అధికారులు రావాలని భీష్మించి కూర్చొన్నారు. ఎట్టకేలకు తహసీల్దార్ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతులు బోరుమంటున్నారన్నారు. తేమ శాతం అంటూ కొర్రీలు, సకాలంలో గన్ని సంచులు ఇవ్వాలని, ధాన్యం తరలించడానికి తగిన లారీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న నిర్లక్ష్యం వల్లే పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కాటాలు వేసి తరలించ కపోవడంతో రైతులకు ఈ పరిస్థితి ఉత్పన్నం అయిందన్నారు. ప్రతి గింజా కొంటాం అంటూ ప్రజా ప్రతినిధులు, అధికారులు నెల రోజులుగా మాయ మాటలు చెప్పి, కార్యాచరణలో పూర్తిగా విఫలం అయ్యారని తెలిపారు. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. రైతులకు ఓపిక నశించి రాష్ట్రీయ రహదారిపై ఆందోళన చేపట్టామన్నారు. కాగా, ఆందోళన నిర్వహిస్తున్న రైతుల వద్దకు తహసీల్దార్ సురేష్ కుమార్ వచ్చి మాట్లాడారు. 20 వేల గన్నీ సంచులు, నాలుగు లారీలు పంపిస్తామని, మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హామీ నెరవేర్చక పోతే గురువారం మార్కెట్‌లో వంటావార్పు కార్యక్ర మాన్ని చేపడతామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య, పులి కృష్ణయ్య, షేక్ మస్తాన్, చల్లా నాగేశ్వరరావు, కట్టా దర్గయ్య, ఐలూరు చలపతి రెడ్డి, వేలూరు సత్యనారాయణ రెడ్డి, వర కిషోర్ రెడ్డి, జంగం కృష్ణారెడ్డి, అనుముల కృష్ణయ్య, కోలేటి ప్రసాద్, పగడాల కృష్ణారెడ్డి, కర్ణాటక కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైటాయించారు. 20 రోజుల క్రితం ఆగమేఘాల మీద పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా తూకం వేయక కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని తహసీల్దార్ బాలలక్ష్మి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES