– ఇష్టారాజ్యంగా మిరప తొడిమెల కాల్చివేత
– పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న జనం
– ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
– మిర్చి కల్లాల వ్యాపారుల ఇష్టారాజ్యం !
– ఇదీ వరంగల్ ఎనుమాముల మార్కెట్ దుస్థితి
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కల్లాల వ్యాపారుల నిర్లక్ష్యం వల్ల స్థానిక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కల్లాల వద్దే మిర్చి తొడిమెలు కాల్చడంతో దుర్వాసన, పొగ వల్ల ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ సమీపంలోని ఎనుమాముల, ఎన్టీఆర్‌నగర్, సుందరయ్యనగర్, రెడ్డిపాలెం, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, దమ్ము, ఉబ్బుసం, అస్తమాతోపాటు కంటి జబ్బుల బారిన పడుతున్నారు. ఇదే విషయమై స్థానిక నాయకులు, ప్రజలు పలుమార్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మిర్చి కల్లాల యజమాన్యంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. దాంతో మిర్చి కల్లాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆగని మంటలు.. పట్టించుకోని ‘మున్సిపల్’
ఎనుమాముల మార్కెట్ సమీపంలో గత బుధవారం రాత్రి సుమారు 10గంటల సమయంలో లాలా ట్రేడర్స్ యజమాని తన మిర్చి కల్లం వద్ద తొడిమెలు కాల్చగా మంటలతో దట్టంగా పొగ చూరి చుట్టు పక్కన ఉన్న కాలనీలకు వ్యాపించాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎనుమాముల పోలీసులకు తెలిపారు. వెంటనే స్పందించిన సీఐ రాఘవేందర్ ఫైర్ ఇంజన్‌ను రప్పించి అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు చల్లారకపోవడంతో ఫైరింగ్ సిబ్బంది సూచన మేరకు పోలీసులు జేసీబీ, డోజర్‌లను తెప్పించి సుమారు మూడు గంటలు తీవ్రంగా శ్రమించి అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. దాంతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఏటా ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ అధికారులు సైతం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించని వ్యాపారుల కల్లాలను సీజ్ చేయాల్సిన మున్సిపల్ అధికారులు కూడా కన్నెత్తి చూడకపోవడం పట్ల ఆరోపణలొస్తున్నాయి.
బాధ్యత నుంచి తప్పించుకుంటున్న అధికారులు
మిర్చి కల్లాల వద్ద తొడిమెలు తగలబెట్టడం వల్ల పరిసర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాము గతంలో అనేకసార్లు మార్కెట్ అధికారులకు, పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. మిర్చి కల్లాల బాధ్యతను ఒకరిపై ఒకరు వేసుకుంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు.
– మూడుసు నరసింహ, ఎస్సార్ నగర్
మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లో మిర్చి కల్లాల వద్ద మిర్చి తోడిమెలు తగల పెట్టకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పరిసర ప్రాంత ప్రజలు మిర్చి తోడిమెలు తగలబెట్టడం వల్ల వచ్చే పొగ వల్ల రోగాల పాలవుతున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్‌ను ముట్టడిస్తాం.
– సింగారపు బాబు, సీఐటీయూ నాయకులు
పేదల బతుకులు అంటే పట్టింపు లేదు
మిర్చి కల్లాల యజమానులకు పేదల బతుకులంటే పట్టింపు లేదు. వారు మిర్చి తోడిమెలను తగులబెట్టి వరంగల్ నగరంలోని వారి ఇండ్లలో హాయిగా ఉంటున్నారు. శివారు ప్రాంతాల్లో ఉండే ప్రజలు, పిల్లలు, వృద్దులు, ఆపరేషన్ చేయించుకున్నవారు అనేక ఇబ్బందులుపడుతూ సతమతమవుతున్నారు. మున్సిపల్, మార్కెట్ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి.
– ఈర్ల రాజేందర్, ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు