ఆయన మాటలు అస్సలు పట్టించుకోవద్దు, ఆయనది నరంలేని నాలుక. ఈ డైలాగ్ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి నోటినుండి వినే ఉంటారందరూ. అది అలా అలా పాకి పాకి ఇంకొందరు ఆ మాటలు నేర్చుకుంటారు. నేర్చుకోవడమే కాదు సమయం, సందర్భం వచ్చినా, రాకున్నా దాన్ని సృష్టించి మరీ వాడతారు. నరం లేని నాలుక అంటారు కాని అది అబద్దం. నాలుకకూ ఓ నరముంటుంది. దాని పేరు హైపోగ్లాసల్ నరం. నాలుకకు నరం ఉండదని చెప్పడం అబద్దమైతే, ఎన్నో అబద్దాల్ని ఆ నాలుక ద్వారానే చెబుతారు. అయినా నాలుకేం చేస్తుంది పాపం, మెదడు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతుంది, అస్సలు మాట్లాడొద్దు అని మెదడు చెబితే మౌనంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి పోతుంది. ఏది జరిగినా, ఎందరు ఏమన్నా వినీ విననట్టు ఉండు నేను నోరు విప్పమన్నప్పుడే విప్పు అని చెబితే అలాగే చేస్తుందది.
మాట్లాడినా, మౌనంగా ఉన్నా పదిమంది మంచికోరేవాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది నాలుక. తనకు, తమవాళ్ళకు అవసరమనుకుంటే అది ఊరకే ఉంటుంది. దేశమంతా మంటల్లో ఉన్నప్పుడు నాయకుడు నోరు విప్పడు. అది అతడి మెదడు సందేశం. ఎక్కువమంది విన్నప్పుడే ఏదైనా చెబుతాను అని భీష్మించుకుని కూచుంటే ఎవరూ ఏమీ చేయలేరు. అది వారి తెలివి. ఈ మధ్య కృత్రిమ తెలివి అంటూ చెబుతున్నారు. మనిషి మెదడు అవకాశం కొద్దీ ఎలాగైతే పనిచేస్తుందో ఈ కృత్రిమ తెలివి కూడా అంతే. మనుషుల అవసరాలకు స్పందించేలా మాత్రమే దాన్ని వాడతారు. రుద్రాలిక నయనజాలిక, కలకత్తా కాళిక నాలిక, కావాలోరు నవకవనానికి అని నవకవితలో మహాకవి శ్రీశ్రీ చెబుతారు. రాబందుల రెక్కల చప్పుడు, పొగగొట్టపు భూంకార ధ్వని గురించి కూడా చెబుతాడాయన. రాబందు నిశ్శబ్దంగా తనపని తాను చేసుకుపోతుంది. ఏదైనా ప్రాణిని చంపి తినాలన్నప్పుడు మాత్రం తన రెక్కలను ఉపయోగించుకొని, తనక్కావలసిన పద్ధతిలో వాటిని కొడుతుంది. ఆ శబ్దం ఎవ్వరూ వినుండకపోవచ్చు కాని మహాకవి విన్నాడు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి.
మహాకవి కాబట్టి, నవ్యతకు మార్గ నిర్దేశకుడు కాబట్టి మహాకవి ఎన్నెన్నో రాశాడు. ఆ కొత్తదనం వద్దు, ప్రాచీన కాలానికి ఎన్ని వందల సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు వెనక్కు తీసుకుపోవాలనుకునే నాయకుడికి కలకత్తా కాళిక నాలిక అవసరం లేదు. రంగులు మార్చే ఊసరవెల్లి నాలుక కావాలతనికి. అతని వెనుక కూచొని, టీవీల్లో చూస్తూ, సెల్లుల్లో వింటూ చప్పట్లు చప్పట్లు కొట్టేవారిది కూడా అదే పరిస్థితి. వీలైంతగా దేశాన్ని వెనక్కు, వెనక్కు ఎంత వీలైతే అంత వెనక్కు తీసుకునిపోవడం. ఆ చప్పట్లు చరిచేవారిదీ ఇందులో భాగం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. వాళ్ళకు దేశభక్తి ఉంది కదా! అందుకే ఆ పక్షాన ఉన్నారని చెప్పేవాళ్ళూ ఉన్నారు. ఇక వాళ్ళకేనా దేశభక్తి ఇతరులంతా దేశద్రోహులా, సమాధానం ఉండదు. మౌనమే పూర్తి అంగీకారం, సగం కానేకాదు. ఓ నాలుకా నీకెందుకే ఇన్ని కళలు? తెలీనివారికి తెలపడం సులభం, తెలిసినవాళ్ళకు చెప్పవలసిన పనిలేదు, తెలిసీ తెలియనట్టు నటించేవాళ్ళకు మాత్రం తెలపటం కష్టం.
సగటు ఆలోచనాపరుడికి చాలా కష్టమైన, క్లిష్టమైన, సంక్లిష్టమైన కాలం ఇది. దేశకాల పరిస్థితుల్ని చూస్తే కడుపు తరుక్కుపోతుందొక పక్క. అసత్యాలు రాజ్యమేలుతుంటాయి, సత్యం బట్టలు లేకుండా సంచరిస్తుంటుంది. భరతమాత గురించి వేరే విధంగా మాట్లాడకూడదట. వాళ్లుచెప్పినట్టే వినాలట. ఏమన్నా అంటే ఇలా ఇంతవరకూ ఎవ్వరూ అనలేదన్న అపవాదు. ఇంగ్లీషు పేరొచ్చేలా దేశపు పేరును వాడొద్దట. దాన్ని అపహాస్యం చేస్తారు. నిజాలు చెప్పవలసిన చట్టసభల్లో జోకులేస్తారు, వీరంగం చూపిస్తారు.
వాళ్లు ఎన్ని గాలి కబుర్లు చెప్పినా వినాలి అంతే కాని ఇటు పక్క కూచున్న వాళ్ళు గాలిలో చేతులు ఊపకూడదు. కేసు పెట్టినా పెడతారు. మాట్లాడవలసిన అసలు విషయాన్ని ఊరకే అలా టచ్ చేసి మిగతా సమయాన్ని అంటే ప్రజల సమయాన్ని తమకు వాడుకుంటారు. ప్రజల డబ్బంటే లెక్క లేనివాళ్ళకు ప్రజల సమయం ఓ లెక్కనా? ఇక నరం లేని నాలుక లాగే ఎముక లేని చేయి ఒకటుంది. బాగా దానం చేసేవాళ్ళ చేయికి ఎముక ఉండదంటారు. అంటే ఉత్త కండరాలు ఆత్రమే ఉండాలి లెక్క ప్రకారం. ఇది కూడా శుద్ధ అబద్దం. ప్రజలకు ఇచ్చే విషయంలో గట్టి గట్టి ఎముకలుంటాయి. అవే ఎముకలు మిత్రులకు ప్రజల సొమ్ము ధారబోసే విషయంలో తమ శరీరంలో ఉన్న ఎముకలు, కండరాలు, నరాలు ఒకటేమిటి ఏవీ పనిచేయవు. సర్వం అప్పజెబుతారు.
చివరాఖరికి చెప్పేదేమంటే నాలుక ఉంటుంది కాని పని చేయించరు. ఎముకలు ఉంటాయి కాని లేనట్టే ఉంటారు. సమయం ఉంటుంది కాని కేటాయించరు. అయినా నోరు విప్పించే మార్గాలు, విప్పిన నోట్లోనుంచి మాటలు తెప్పించే మార్గాలు, ఎముకలు విరగ్గొట్టి మిత్రులకు దానాలు చేయించేవారిని నివారించే మార్గాలు, ప్రజల సమయాన్ని ప్రజలకే వాడాలన్న విషయం తెలిపే మార్గాలు అనేకం ఉంటాయి. వాకిలి వేసి గదిలో పిల్లి వెంట పడితే అది రెండు మూడు రవుండ్లు అయ్యాక తిరగబడుతుంది, ఎదురు తిరుగుతుంది. అదే విధంగా మాట్లాడని నోటికి, నాలుకకున్న నరానికి కరెంటు షాకు కొట్టించి మరీ తెరిపిస్తారు, మాట్లాడేలా చేస్తారు.
జె. రఘుబాబు
9849753298