Sunday, May 18, 2025
Homeమానవిగిరిజ‌న మ‌హిళల జీవితాల్లో కొత్త వెలుగు

గిరిజ‌న మ‌హిళల జీవితాల్లో కొత్త వెలుగు

- Advertisement -

సుమారు మూడు దశాబ్దాల కిందట ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ జిల్లాలోని మహిళలు తమ జీవితంలో ఎక్కువ భాగం తన గ్రామం వెలుపల మరో ప్రపంచం ఒకటి ఉందనే విషయమే తెలియకుండా గడిపేసేవారు. 11, 12 ఏండ్ల వయసులో వివాహం చేసుకుని జీవితమంతా వంటగదిలో, పొలాలలో గడిపేవారు. పిల్లలను పెంచేవారు. ఇంట్లో పెద్దలను చూసుకునేవారు. అలాంటిది నేడు ఒక మహిళ కొత్త ప్రపంచానికి మాతృమూర్తిగా నిలిచింది. చేనేత సామాజిక వ్యవస్థాపకురాలిగా ఆవిర్భవించింది. ఆమే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆర్తి రాణా.
350 స్వయం సహాయక సంఘాలలోని పదివేల మంది థారు మహిళలు నేడు చేనేత, సాంప్రదాయ చేతిపనులు నిర్వహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు. ఈ స్థానిక జాతికి చెందిన ఇతర అమ్మాయిల మాదిరిగానే ఆర్తి కూడా పెరిగింది. 18 ఏండ్ల వయసులో వివాహం చేసుకొని 20 ఏండ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె వివాహం అయిన తొలినాళ్లలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) గురించి తెలుసుకుంది. అది ఆమె జీవిత గమనాన్ని మాత్రమే కాకుండా ఆమె పంచాయతీలోని ప్రతి మహిళ జీవితాన్ని కూడా మార్చివేసింది.
కష్టాలు కమ్మేసిన వేళ
థారు అని పిలవబడే గిరిజన సమాజం ప్రధానంగా నేపాల్‌లోని తెరారు ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని సమీప పర్వత ప్రాంతాలలో నివసిస్తుంది. దేశంలోని ఇతర గిరిజన సమాజాల మాదిరిగానే వీరు కూడా బలమైన సహజ ఔషధ సంప్రదాయాన్ని (ముఖ్యంగా మలేరియా నిరోధకతకు ప్రసిద్ధి చెందింది) సంరక్షించినప్పటికీ, వారి సాంప్రదాయ పద్ధతులు వారిని భూముల నుండి దూరం చేశాయి. దీనికి తోడు వలసవాదం, కులతత్వం, ఆధునిక వైద్య ఆధిపత్యం వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. అలాంటి సమయంలో రాణా తన తల్లితో కలిసి చిన్నతనంలోనే ఘఘ్రా-చోళీలను కుట్టడం ప్రారంభించింది. 2015లో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కార్యక్రమం ఆమె గ్రామానికి వచ్చినప్పుడు అందులో తను కూడా చేరాలనుకుంది. కానీ అత్తమామలు వ్యతిరేకించారు. అయినా ఆమె పట్టువదలలేదు. అలా దానిలో చేరిన 25 మందిలో ఐదుగురు మహిళలలో ఆర్తి ఒకరు.
కొత్తగా ఏదో నేర్చుకున్నా
‘నేను మా గ్రామం విడిచి సీతాపూర్‌కు ప్రయాణించడం అదే మొదటిసారి. అప్పుడు నన్ను నేను ఒక విద్యార్థిలా భావించాను. నా ఇంటి నుండి కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. నా బాధ్యతల నుండి దూరంగా కొత్తగా ఏదో నేర్చుకున్నాను. మగ్గంపై ఎలా పని చేయాలో నేర్చుకున్నాం. ధరీలు (నేసిన చాపలు) తయారు చేసాము. చెరకు ఆకులతో మా తలలపై పైకప్పులను కూడా కుట్టగలము. సులభంగా లభించే ఈ పదార్థాల వెనుక ఉన్న ప్రయోజనకరమైన విలువను తెలుసుకోవడం వల్ల నన్ను నేను ఓ సమర్థురాలిగా భావించాను. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నాకు తెలిసిన ఏకైక విషయం అడవి నుండి కట్టెలు సేకరించి చేపలు పట్టడం’ అంటూ ఆమె పంచుకున్నారు.
స్థిరమైన ఆదాయం చూసి
కార్యక్రమం ప్రారంభంలో జిల్లా మేజిస్ట్రేట్‌ శిక్షణ తీసుకున్న మహిళలు తమ సొంత గ్రామాలలో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, చేనేత పనిలో ఇతరులకు శిక్షణ ఇవ్వమని ప్రోత్సహించారు. దీనికి ఆర్తీ నాయకత్వం వహించారు. దీనికోసం ఆమె తన పంచాయతీ అంతటా ప్రయాణించి మహిళలను సంప్రదించారు. వారి కుటుంబాలను ఒప్పించారు. ‘తమ మహిళలు బయటకు వెళ్లి పని చేయడం అనే ఆలోచనను చాలా మంది వ్యతిరేకించారు. అమ్మాయిలను పాఠశాలకు పంపడానికి సౌకర్యంగా లేనట్లే దీన్ని కూడా అలాగే భావించారు. కానీ వాతావరణ పరిస్థితుల వల్ల పశువులు చనిపోవడం, పంటలో తీవ్ర నష్టాలను చవి చూశారు. అదే సమయంలో మా శిక్షణ సమయంలో మేము చేసిన అమ్మకాల వల్ల స్థిరమైన ఆదాయాన్ని చూపించాయి. దాంతో ప్రతి కుటుంబం అదనపు ఆదాయం పొందవచ్చని నమ్మింది’ అని ఆమె పంచుకున్నారు.
అప్‌సైకిల్‌ చేసి…
ప్రారంభ శిక్షణకు వెళ్ళిన 25 మందిలో ఆర్తి మాత్రమే దాన్ని కొనసాగించారు. మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ‘ఒక నెలలో మేము 44 గ్రామాలలో 350 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసాము. ప్రారంభంలో మాకు ముడి పదార్థాలు అవసరమైన ప్రతిసారీ సీతాపూర్‌కు ప్రయాణించాల్సి వచ్చింది. తర్వాత మేము ప్రజలను వారి పాత, ఉపయోగించని వస్త్రాలను దానం చేయమని అడగాము. మేము వాటిని కొత్త ధరీలలోకి అప్‌సైకిల్‌ చేసాము’ అని పంచుకున్నారు. ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (ఐటీడీపీ), వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) వంటి సంస్థల మద్దతుతో ఆర్తి తన ప్రయత్నాలను విస్తరించారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో మహిళలు మూంజి గడ్డి (ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానాలో సాధారణంగా కనిపించే పొడవైన, దృఢమైన గడ్డి) ఉపయోగించి బుట్టలు, పెన్‌ స్టాండ్‌లను తయారు చేశారు. ఇది వారి చేనేత వస్త్రాలతో పాటు, ట్రైబల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ ప్రదర్శనలలో ప్రజాదరణ పొందింది.
ఎలాంటి హక్కులూ లేవు
సొంత గ్రామాల చుట్టూ ఉన్న అడవుల్లో మూంజీ గడ్డి విస్తారంగా పెరుగుతున్నప్పటికీ దీని కోసం కూడా తాము తరచూ పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని ఆర్తి చెబుతున్నారు. ‘గడ్డి మాకు సమీపంలో ఉన్నా దాన్ని వినియోగించే అనుమతి మాకు లేదు’ అని ఆమె అన్నారు. ఇది వారి అనేక సమస్యలను ప్రతిబింబిస్తుంది. అనేక అటవీ నివాస గిరిజన వర్గాల మాదిరిగానే, థారులు ఈ భూమిపై తరతరాలుగా నివసిస్తున్నారు. అయినప్పటికీ దాని సహజ వనరులను ఉపయోగించుకునే హక్కులు వారికి లేవు. జీవనోపాధి అనేది వారికి ఆర్థిక భారంగా మారుతోంది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ చేనేత, హస్తకళలపై దృష్టి సారించే స్వయం సహాయక బృందం తరు హత్‌ కార్గా ఘరేలు ఉద్యోగ్‌, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద గౌతమ్‌ స్వయం ఉపాధి సమూహం కార్పెట్లు, బుట్టలు, బ్యాగులు వంటి వస్తువులను ఉత్పత్తి చేయడంలో మహిళలను నిమగం చేస్తుంది. వీటిని ఆర్తి నడుపుతున్నారు.
నేను కోరుకున్న విధంగా
ఈ స్వయం సహాయక సంఘాలలో భాగమైన ఇద్దరు అబ్బాయిల ఒంటరి తల్లి సునీతా రాణా తన పెద్ద కొడుకును ఢిల్లీలోని ఒక ప్రైవేట్‌ కళాశాలకు పంపడానికి అవసరమైన డబ్బు సంపాదించారు. ‘దీనికి ముందు నేను పొలంలో పనిచేసేదాన్ని. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. మా ఇంట్లో ఆర్థికపరంగా మా మామ నియంత్రణ ఉండేది. ఇప్పుడు నేను నెలకు రూ. 10,000-12,000 సంపాదిస్తాను. ఆయనకు కూడా ఇందులో కొంత ఇస్తున్నాను. మిగిలిన మొత్తాన్ని నేను కోరుకున్న విధంగా ఉపయోగించుకుంటున్నాను’ అని సునీత చెప్పారు.
దోపిడీ సర్వసాధారణం
సాంప్రదాయ చేతిపనుల ద్వారా గిరిజన మహిళల్లో స్వావలంబనను ప్రోత్సహించడంలో ఆర్తి చేసిన కృషికి 2016లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుండి రాణి లక్ష్మీ బాయి అవార్డు, 2020కి భారతదేశంలో మహిళలకు అత్యున్నత పౌర పురస్కారం అయిన నారీ శక్తి పురస్కార్‌ లభించాయి. ‘మనం తరచుగా 21వ శతాబ్దంలో పురోగతి గురించి మాట్లాడుతాము. కానీ అనేక స్థానిక సమాజాల జీవితాల్లో వాస్తవాలు వేరే ఉన్నాయి. వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. ఇతరుల కింద పనిచేసేటప్పుడు దోపిడీ సర్వసాధారణం. అందుకే మనకు స్వయం సహాయక బృందాలు చాలా ముఖ్యమైనవి. అవి మన మహిళలకు భద్రత, గౌరవం, జీవనోపాధి పొందేలా చేస్తాయి. అక్కడ వారు అణిచివేత నుండి, రోజువారీ సూక్ష్మ దురాక్రమణల నుండి విముక్తి పొందారు. ఎంత పని చేయాలో, ఎప్పుడు పని చేయాలో వారే నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా వారు తమ సొంత భవిష్యత్తుకు బాధ్యత వహిస్తారు’ అంటూ ఆమె తన మాటలు ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -