Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలునూతన విత్తన చట్టం సిద్ధం!

నూతన విత్తన చట్టం సిద్ధం!

- Advertisement -

– ప్రతిపాదనలపై రైతు కమిషన్‌ కసరత్తు పూర్తి
– అన్నదాతలు నష్టపోతే కంపెనీలదే బాధ్యత
– కల్తీ విత్తనాలు అమ్మితే ఊచలు లెక్కించాల్సిందే.!
– పలు సంఘాలు, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్‌
– ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి అవకాశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
: తెలంగాణ నూతన విత్తన చట్టం సిద్ధమవుతున్నది. ప్రతిపాదనలు ఎలా ఉండాలనే దానిపై విత్తన చట్టం కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నకిలీ, కల్తీ విత్తనాలతో రైతులు భారీగా నష్టపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు కమిషన్‌ నూతన విత్తన చట్టం రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రైతు సంఘాలు, మేధావులు, వ్యవసాయ నిపుణులు, రైతుల అభిప్రాయాలను సేకరించింది. మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విత్తన చట్టాలను పరిశీలించింది. చట్టంలో ఉండాల్సిన అంశాలపై ఇప్పటికే పలు సూచనలు, సలహాలు తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలను సేకరించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నూతన విత్తన చట్టం ముసాయిదాను ఆమోదించే అవకాశం ఉన్నది. ఆ దిశగా రైతు కమిషన్‌ కసరత్తు చేస్తోంది.
చట్టం అవసరమేంటి?
రాష్ట్రంలో ప్రతియేటా ఏదో ఒక చోట రైతులు కల్తీ విత్తనాలతో పెద్దఎత్తున నష్టపోతున్నారు. ఒక సీజన్‌లో పంట నష్టపోతే ఆ ఏడాదే కాదు, మరుసటి ఏడాది కూడా వారిని కష్టాలు వెంటాడుతుంటాయి. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరవు. ఆ అప్పులు చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. మరుసటి ఏడాది మళ్లీ పెట్టుబడులకు అప్పులు పుట్టవు. చివరకు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దయనీయ పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన విత్తనం ద్వారానే పంట ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అదే విత్తనం నకిలీదైతే.. రైతులు నష్టాలు తద్వారా కష్టాలపాలవుతున్నారు. అన్నదాలకు నాణ్యమైన విత్తనాలను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తోడు విచ్చలవిడిగా ప్రయివేటు కంపెనీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కంపెనీలకు, రైతులకు సంబంధం లేకుండా థర్డ్‌ పార్టీ ద్వారా విత్తనాల అమ్మకం, కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. దీని వల్ల పంట నష్టపోతే రైతులు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. కంపెనీలు సైతం తమకేం సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నాయి.
జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పత్తి విత్తనాలతో రైతులు వందల కోట్లు నష్టపోతున్నారు. విత్తనం కొనేటప్పుడు నాణ్యత గురించి నమ్మబలికే కంపెనీలు.. పంట పండనప్పుడు పరిహారం చెల్లించాలని అడిగితే మాత్రం తప్పించుకుం టున్నాయి. ఆ విత్తన ప్యాకెట్‌ ఎక్కడ కొన్నారో చూపించడంతో పాటు పంట పూర్తయ్యేవరకు ఆ కవర్‌ దాచిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే పంట నష్టపోతే ఆ కవర్‌ పట్టుకుని వెళ్లి చూపిస్తేనే.. ఎంతో కొంత పరిహారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితి కూడా ఉండదు. న్యాయపరంగా అడిగే హక్కు రైతుకు లేదు. నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న కారణంగా కంపెనీలు ముఖం చాటేస్తున్నాయి. రైతులు మాత్రం కంపెనీ ఆర్గనైజర్ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోంది. అయినా పరిహారం అందడం లేదు. ఇటీవల ములుగు జిల్లాల్లో మొక్కజొన్న పంట విషపూరితమైంది. అది తిన్న పశువులు చనిపోయాయి. రైతులు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్రంలో ప్రతి సీజన్‌లో ఇలాంటి ఉదారహణలెన్నో ఉంటున్నాయి.
నూతన విత్తన చట్టంలో ఏముంది?
ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విత్తన చట్టాలను రైతు కమిషన్‌ పరిశీలించింది. రాష్ట్రంలో బలమైన, సమగ్రమైన విత్తన చట్టం తేవాలని నిర్ణయించింది. రైతులను మోసం చేస్తే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవనేలా నిబంధనలు పొందుపరిచారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులు మోసపోతే సదరు కంపెనీల నుంచే నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. అంతేకాదు, కంపెనీలపై జరిమానా విధించడం, బాధ్యులకు జైలు శిక్ష పడేలా చేయడం వంటి వాటితో సర్కారు చట్టాన్ని తీసుకరానుంది. ఒక్కో పంటకు ఒక్కో రకంగా పరిహారం చెల్లించేలా ముసాయిదాలో నిబంధనలను పొందుపరిచారు.
ఈ రకంగా పంట సీజన్‌ (ఆరు నెలలు) పూర్తయ్యాక పంట నష్టపోతే రైతుకు 100 శాతం పరిహరం అందించేలా కఠిన నిబంధనలు ఉన్నట్టు సమాచారం. పంట కాలం, పెట్టుబడి, రైతు కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం అందే విధంగానూ చట్టం ఉండనుంది. సీజన్‌ మధ్యలో పంటకు నష్టం వాటిల్లినట్టు తెలీతే 50 శాతం, విత్తనాలు వేసిన మొదట్లో దెబ్బతింటే 10 నుంచి 20 శాతం నష్టపరిహారం ఇవ్వాలనేది నిబంధన.
కార్పొరేట్‌ కంపెనీలను ఈ చట్టం ఎదుర్కోగలదా?
రాష్ట్రంలో విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ విత్తన కంపెనీలు పాగా వేశాయి. పత్తి విత్తనాలపై వాటిదే ఆధిపత్యం. కార్పొరేట్‌ విత్తన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. అందుకు అనుగుణంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రైతుల ఒత్తిడి ఫలితంగా కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసింది. కానీ పరోక్షంగా వాటిని బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్టు రైతు సంఘాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకరానున్న ఈ నూతన విత్తన చట్టం… కార్పొరేట్‌ విత్తన కంపెనీలను ఎంత వరకు నియంత్రించగలవో తెలియని పరిస్థితి. అసలు ఆ కంపెనీలు ఈ చట్టం నిబంధనలను అమలు చేస్తాయా? అని ప్రశ్నార్థకమే. అందువల్ల కార్పొరేట్‌ సీడ్‌ కంపెనీలను ఈ చట్టం ఎంత వరకు నియంత్రించగలదో వేచి చూడాల్సిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img