Sunday, July 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌కు ఆయుధ రవాణా వద్దు

ఇజ్రాయిల్‌కు ఆయుధ రవాణా వద్దు

- Advertisement -

– యూరప్‌లో కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత
– ఆ దేశానికి మిలిటరీ షిప్‌మెంట్స్‌ను నిరాకరిస్తున్న వైనం
– గాజాలో ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న మారణహోమంపై ఆగ్రహం
యూరోప్‌ :
గాజాలో ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న మారణహోమంపై ప్రపంచదేశాల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు యూరప్‌లోని కార్మిక సంఘాలు కూడా ఇజ్రాయిల్‌ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాలస్తీనా ప్రజల పట్ల దారుణ చర్యలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌కు మిలిటరీ షిప్‌మెంట్‌లను వారు వ్యతిరేకిస్తున్నారు. యూరప్‌లోని పలు దేశాల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ప్యారిస్‌లో ఇదే ఘటన ఎదురైంది. ఇజ్రాయిల్‌కు వెళ్లాల్సిన మిలిటరీ కార్గోను ఎయిర్‌పోర్టులో పని చేసే కార్మికులు నిరాకరించారు. గాజాలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు భాగస్వామ్యమయ్యే లాజిస్టికల్‌ ఆపరేషన్స్‌కు ఏవియేషన్‌ సెక్టార్‌ కార్మికులుగా తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనటాన్ని వ్యతిరేకిస్తున్నామని కార్మిక సంఘం ఎస్‌యూడీ ఏరియన్‌ తెలిపింది. పాలస్తీనియన్లకు సంఘీభావం పలికిన ఫ్రెంచ్‌కార్మికులు.. ఇతర ప్రదేశాలలో కూడా ఇలాంటి చర్యలకు పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్‌కు సైనిక పరికరాలను రవాణా చేయటాన్ని నిరాకరించటం ప్రతిఘటనలో భాగమనీ, ఇది పాలస్తీనా ప్రజలకు గౌరవాన్ని కలిగించే చర్య అని రైలు, వైమానిక, ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రజలు సామూహికంగా శిక్షను ఎదుర్కొంటుంటే తాము మౌనంగా ఉండలేమని వివరించాయి. ఫ్రెంచ్‌ కార్మికులు ఇజ్రాయిల్‌కు షిప్‌మెంట్లు నిరాకరించటమనేది ఇదే మొదటిసారి కాదు. గతనెలలో ఎస్‌యూడీ ఏరియన్‌ అదే ప్యారిస్‌ విమానాశ్రయం ద్వారా ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కార్గోను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
అణచివేతకు గురవుతున్నవారికి మా సంఘీభావం
ఈ చర్యల ద్వారా ప్రభుత్వాలు, యాజమాన్యాలు చేసే మారణహోమంలో తాము భాగస్వామ్యం కాకుండా నిరాకరిస్తున్నామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. మా పని యుద్ధాన్ని రవాణా చేయటం కాదని ఎస్‌యూడీ ఏరియన్‌తో పాటు పలు కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. అణచివేతకు గురవుతున్నవారికి మా సంఘీభావ ముంటుందనీ, నేరాలకు పాల్పడేవారికి కాదని స్పష్టం చేశాయి.
స్వీడన్‌, ఇటలీ,
బ్రిటన్‌లలోనూ వ్యతిరేకత
ఇజ్రాయిల్‌కు ఆయుధ రవాణాను నిలిపివేసే ప్రయత్నాలు యూరప్‌లోని ఇతర దేశాలైన స్వీడన్‌, ఇటలీ, బ్రిటన్‌ వంటి దేశాల్లో కనిపించాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని పలు రంగాలకు చెందిన కార్మికులు ఇజ్రాయిల్‌కు షిప్‌మెంట్‌ను నిరాకరించారు. ఇజ్రాయిల్‌కు ఎగుమతి అయ్యే, అక్కడి నుంచి దిగుమతయ్యే మిలిటరీ ఎక్విప్‌మెంట్‌పై పూర్తిస్థాయి నిషేధానికి డాక్‌కార్మికులు (ఓడలోకి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే కార్మికులు) ఓటు వేశారు. ఇటలీలోని జెనోవాలో డాక్‌ కార్మికులు, యూఎస్‌బీ కార్మిక సంఘానికి చెందిన సభ్యులు ఇజ్రాయిల్‌కు మిలిటరీ షిప్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -