నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. భారత దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరిపేది లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. మరోవైపు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, రైతుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లయింది.
భారత్ నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవల్ ఆఫీస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, “లేదు, ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు ఎలాంటి చర్చలు ఉండవు” అని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ నేరుగా లేదా ఇతర మార్గాల్లో చమురు దిగుమతి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇది తమ జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి పెను ముప్పుగా భావిస్తున్నామని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కారణంగానే అత్యవసర ఆర్థిక చర్యలు చేపట్టినట్లు తెలిపింది.