నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో అత్యాధునికంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (జేవార్) శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడి అధికారికంగా ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్.. దేశ విమానయాన రంగంలో సరికొత్త రికార్డులకు వేదిక కానుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏర్పడుతున్న విపరీతమైన రద్దీని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది. దాదాపు రూ.11,200 కోట్ల వ్యయంతో, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో (ఎఫ్‌డీఐ)జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ దీనిని నిర్మించింది. నోయిడా, మీరట్, ఘజియాబాద్, మథుర, ఆగ్రా తదితర ప్రధాన నగరాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది. నేడు ప్రధాని పర్యటన నేపథ్యంలో …. జేవార్‌లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది పోలీసులు, ఎస్పీజీ, ఏటీఎస్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దఅష్ట్యా ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. మరోవైపు, ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్లే భారీ వాహనాలను పోలీసులు మళ్లించారు. అయితే, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదిగా, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా రికార్డు సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని నాలుగు దశలలో రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు విస్తీర్ణం కూడా దశలవారీగా పెంచనున్నారు. మొదటి దశలో సుమారు 3296ఎకరాలలో విమానాశ్రయం విస్తరించి ఉంది. ఇందులో 3900మీటర్ల పొడవైన రన్ వే, ఒక ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్, టాక్సీవేస్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ దశ పూర్తయితే సంవత్సరానికి 12 మిలియన్ల మంది ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణం చేసే అవకాశం ఉంది. భారతీయ వారసత్వాన్ని, సంప్రదాయ ఘాట్ లను, హవేలీలో సౌందర్యాన్ని మేళవించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక మౌలిక సదుపాయాలను ఈ విమానాశ్రయాన్ని రూపొందించారు .ఈ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి విమాన కేంద్రంగా మార్చటంపై దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుంది.



